హుజూర్ నగర్ టీఆర్ఎస్ అభ్యర్థి ఖరారు

ఉమ్మడి నల్గొండ జిల్లా హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఎన్నికల నగారా మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం హరియాణా, మహారాష్ట్రతో పాటు హుజూర్ నగర్ ఉప ఎన్నికకు కూడా షెడ్యూల్ విడుదల చేసింది. సెప్టెంబర్ 23న నోటిఫికేషన్ విడుదల చేస్తారు. 30వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. అక్టోబర్ 1న పరిశీలిస్తారు. అక్టోబర్ 21న ఎన్నిక జరుగుతుంది. 24న ఫలితం వస్తుంది.
హుజూర్ నగర్ టిఆర్ఎస్ అభ్యర్ధిగా శానంపూడి సైదిరెడ్డిని ఖరారు చేశారు సీఎం కేసీఆర్. షెడ్యూల్ విడుదల అయిన కొద్దిసేపటికే ముఖ్యమంత్రి ఈ ప్రకటన చేయడం విశేషం. 2018లో కూడా సైదిరెడ్డి హుజూర్ నగర్ నుంచి పోటీచేశారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి గట్టి పోటీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో మరోసారి కేసీఆర్ సైద్దిరెడ్డి వైపే మొగ్గుచూపారు. ఆర్ధికంగా, సామాజికవర్గపరంగానూ బలమైన అభ్యర్ధి అవుతారని టిఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి. మంత్రి జగదీశ్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ముద్రపడ్డ సైదిరెడ్డి ఎన్నారైగా పార్టీలో చేరి... తర్వాత క్రియాశీలకంగా వ్యవహరించారు.
అటు హుజూర్‌నగర్ కాంగ్రెస్ అభ్యర్థిగా తన సతీమణి పద్మావతి పోటీచేస్తారని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారు. రాష్ట్రం మొత్తం ఇప్పుడు హూజూర్‌నగర్ వైపే చూస్తోందని అన్నారు. సూర్యాపేట జిల్లా నేరేడుచర్లలో కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన...పద్మావతి 30 వేల మెజార్టీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. నల్గొండ ఎంపీగా గెలిచాక.. ఎమ్మెల్యే పదవికి ఉత్తమ్ రాజీనామా చేయడంతో హుజూర్‌నగర్ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ నియోజకవర్గం కాంగ్రెస్ కంచుకోటగా ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com