ఆపరేషన్‌ రాయల్‌ వశిష్ట ముగిసిన అధ్యాయమే? ఎందుకంటే..

ఆపరేషన్‌ రాయల్‌ వశిష్ట ముగిసిన అధ్యాయమే? ఎందుకంటే..

ఆపరేషన్‌ రాయల్‌ వశిష్ట ముగిసిన అధ్యాయమే అనిపిస్తోంది. నాలుగు రోజులుగా జరుగుతున్న వెలికితీత పనుల్లో ఎలాంటి పురోగతి కనిపించడం లేదు..ఇప్పుడున్న పరిస్థితుల్లో బోటు బయటకు తీయడం కష్టమే అంటున్నారు. ఇప్పటి వరకు ధర్మాడి సత్యం టీమ్‌ చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు.

కచ్చులూరు ప్రాంతంలో పలుమార్లు వర్షం కురుసింది..దీనికి తోడు ఎగువ నుంచి భారీగా వరద పోటెత్తుతోంది. దీంతో ప్రస్తుతానికి బోటు వెలికితీత పనులు నిలిపివేశారు. అధికారుల నుంచి కూడా అనుమతి లభించలేదు. దీంతో నాలుగో రోజు పనులకు పూర్తిగా బ్రేక్‌ పడింది.

బాలాజీ మెరైన్స్‌ 22 లక్షల 70 వేలకు బోటును పైకి తీసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నా.. ఆ ఆపరేషన్‌ దాదాపు ముగిసినట్టే కనిపిస్తోంది. ఒక క్రేన్, పొక్లెయిన్, 2వేల మీటర్ల వైర్ రోప్‌, 2 లంగర్లు, 10 జాకీలతోపాటు ఇంకొన్ని భారీ తాళ్లు, సామాగ్రి ఉన్నా కూడా 250 అడుగుల లోతులో కూరుకుపోయిన బోటు చిక్కడం లేదు.

సెప్టెంబర్ 15న ప్రమాదం జరిగితే ఇప్పటికీ 15 మంది జాడ తెలియలేదు. దుర్ఘటన జరిగినప్పుడు బోటులో 77 మంది ఉన్నారని ప్రభుత్వం చెప్తోంది. వీరిలో 26 మంది ప్రాణాలతో బయటపడగా.. 36 డెడ్‌బాడీలను గుర్తించారు. మిగతా 15 మంది కోసమే ఈ సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు.

అయితే బోటు వెలికితీసే విషయంలోఅధికారుల్లో సమన్వయం లేదని.. టూరిజం, జలవనరుల శాఖలు దీన్ని పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. చూస్తుంటే ఈ ప్రయత్నాల్ని ఇక్కడితో వదిలిపెట్టి.. గల్లంతైన వారికి డెత్ సర్టిఫికెట్లు జారీ చేయడం తప్ప మరో మార్గం లేదన్న భావనలో ప్రభుత్వం ఉన్నట్లు కనిపిస్తోంది.. ఇప్పటికే గల్లంతైన వారి కుటుంబ సభ్యుల్ని ప్రభుత్వం మానసికంగా సిద్ధం చేస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story