రిక్షావాలాను లక్షాధికారి చేసిన లాటరీ..

రిక్షావాలాను లక్షాధికారి చేసిన లాటరీ..
X

రోజంతా రెక్కలు ముక్కలు చేసుకుంటే కానీ కుటుంబాన్ని పోషించుకోవడానికి నాలుగు డబ్బులు వస్తాయి. ఒక్కోసారి కస్టమర్లు దొరికినా రిక్షా తొక్కడానికి ఒంట్లో ఓపిక వుండదు. అయినా తప్పదు బండి లాగక. లేదంటే కుటుంబ పోషణ కష్టమైపోతుంది. రిక్షానే ఆధారంగా బ్రతుకు సాగిస్తున్న అతడి జీవితంలోకి అదృష్టం లాటరీ రూపంలో తలుపు తట్టింది. 50 లక్షలకు అధిపతిని చేసింది. నాగాలాండ్ రాష్ట్రానికి చెందిన గౌర్ దాస్ దిమాపూర్‌లో రిక్షాతొక్కుతూ జీవనం సాగిస్తున్నాడు. తోటి రిక్షాకార్మికులంతా నెలాఖరు కావడంతో ఓ చోట చేరి కబుర్లు చెప్పుకున్నారు. సరదాగా గడిపి ఎవరి ఇళ్లకు వాళ్లు వెళ్లిపోతున్నారు.

ఈ క్రమంలో భారీగా వర్షం కురుస్తోందని గౌర్ దాస్ రిక్షాని ఆపి దగ్గరలో ఉన్న షాపు దగ్గర నుంచున్నాడు. అది లాటరీ టికెట్ల షాపు కావడంతో.. షాపు యజమాని రిక్షా పుల్లర్‌ని ఓ టికెట్ కొనమంటూ బలవంతం చేశాడు. డబ్బులు లేవయ్యా అంటే కూడా వినకుండా రూ.30లే కదా తీసుకో అంటూ టికెట్ చేతిలో పెట్టాడు. చేసేదేం లేక రూ.30లు ఇచ్చి టికెట్ తీసుకున్నాడు గౌర్ దాస్. వారం రోజులకే లాటరీ ఫలితాలు వచ్చాయి. రిక్షావాలా నెంబర్ చూసుకుంటే తను కొన్న టికెట్‌కి రూ.50 లక్షల బహుమతి వచ్చింది. ఒక్కసారే అంత డబ్బును చూసిన ఆనందం.. కష్టాలన్నీ ఇంత తేలిగ్గా గట్టెక్కుతాయని గౌర్ దాస్ అసలు ఊహించలేకపోయాడు. ఉన్నపళంగా రాత్రికి రాత్రే లక్షాధికారి అయిపోయాడు. ఉండడానికి ఓ ఇల్లు కట్టుకుంటానని, పిల్లలను మంచి స్కూల్లో చదివిస్తానని అంటున్నాడు.

Next Story

RELATED STORIES