లలితా జ్యువెలరీలో చోరికి PNB బ్యాంక్‌లో దొంగతనానికి పోలికలు!

లలితా జ్యువెలరీలో చోరికి PNB బ్యాంక్‌లో దొంగతనానికి పోలికలు!

తమిళనాడులోని తిరుచ్చిలో భారీ చోరీ జరిగింది. లలితా జ్యువెలరీకి చెందిన నగల దుకాణంలో 28 కిలోల విలువైన ఆభరణాలు దోచుకుపోయారు. వీటి విలువ 13 కోట్లపైనే ఉంటుంది. బంగారం, వెండి, వజ్రాభరణాలు దొంగలు ఎత్తుకెళ్లినట్టు షోరూమ్ సిబ్బంది ఫిర్యాదు చేశారు. బుధవారం తెల్లవారుజామున ఈ దొంగతనం జరిగింది. ఉదయం షోరూమ్ తెరిచాక కింద నగలు ఉండే గదిలో పెట్టెలన్నీ ఖాళీగా, చెల్లాచెదురుగా పడి ఉండడం గుర్తించి షాకయ్యారు. భవనం వెనుకవైపున చిన్న కన్నం వేసి దొంగలు లోపలికి వచ్చినట్టు తెలుసుకుని వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.

దొంగలు లోపలికి వచ్చిన తీరు.. అక్కడ అన్ని చోట్లా వెతుకుతూ వాళ్లు వ్యవహరించిన విధానం చూస్తే ఇది తెలిసిన వాళ్ల పనిగానే అనుమానిస్తున్నారు. పకడ్బందీగా రెక్కీ చేసి మరీ వాళ్లు ఆభరణాలు దోచేసినట్టు నిర్థారణకు వచ్చారు. అంతా సినీ ఫక్కీలోనే జరిగింది. 2 గంటల్లో షోరూమ్‌ను లూటి చేసి దొంగలు పరారయ్యారు. ఈ మధ్య కాలంలో తమిళనాడులో జరిగిన అతిపెద్ద చోరీ ఇదే కావడంతో పోలీసులు కూడా కేసు ఛాలెంజ్‌గా తీసుకున్నారు. నిందితులు ఎటువైపు నుంచి వచ్చారో తెలుసుకునేందుకు చుట్టుపక్కల ఉన్న అన్ని సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారు. 7 ప్రత్యేక బృందాల్ని ఆపరేషన్ కోసం రంగంలోకి దించారు.

దొంగతనం చేసేందుకు వచ్చిన వాళ్లంతా విచిత్రమైన మాస్క్‌లు ధరించారు. చిన్న పిల్లలు ఆడుకునే జంతువుల మాస్క్‌లు ముఖానికి తొడుక్కుని వాళ్ల ఆనవాళ్లు దొరక్కుండా జాగ్రత్తపడ్డారు. సీసీ ఫుటేజ్‌లో ఇద్దరి దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. వేలిముద్రలు దొరక్కుండా చేతులకు గ్లోవ్స్ వేసుకున్నారు. లోపలికి వచ్చింది వీళ్లిద్దరేనా ఇంకా ఎంత మంది ఈ చోరీ కేసులో ఉన్నారనేదానిపై దర్యాప్తు జరుగుతోంది. షోరూమ్‌లోని సీసీ కెమెరా పరిశీలించిన పోలీసులు.. దొంగలు బుధవారం రాత్రి 2.30కి లోపలికి వచ్చినట్టు గుర్తించారు. దాదాపు 2 గంటలు అన్ని చోట్లా తిరుగుతూ అందినకాడికి దోచుకుని 4.30కి వెళ్లిపోయారు.

తిరుచ్చి సత్రం వీధిలోని లలితా జ్యువెలరీలో జరిగిన చోరీకి, గతంలో ఇదే ప్రాంతంలోని PNB నేషనల్ బ్యాంక్‌లో జరిగిన చోరీకి కొన్ని పోలికలు ఉండడంతో ఈ దొంగల ముఠా ఎవరనే దానిపై లోతైన దర్యాప్తు చేస్తున్నారు. అలాగే.. షోరూమ్‌లో పనిచేస్తున్న 160 మంది సిబ్బందిని కూడా విచారిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story