మోదీ, జిన్‌పింగ్ భేటీకి వేదికగా శోర్.. ఆలయ చరిత్ర ఇదే..

మోదీ, జిన్‌పింగ్ భేటీకి వేదికగా శోర్.. ఆలయ చరిత్ర ఇదే..
X

దేశాధినేతల సమావేశాలు, భేటీలూ అధికారిక నివాసాల్లో జరిగడం అనావాయితీ. అయితే మోదీ కొత్త సంప్రదాయానికి తెరతీశారు. చారిత్రక కట్టడాలను ద్వైపాక్షిక చర్చలకు వేదికలుగా మార్చారు. భారతదేశ చరిత్రను తెలియజేయడంతో పాటు... ప్రపంచదేశాల దృష్టిని కూడా ఆకర్శించి పర్యాటక క్షేత్రాలుగా మారతాయన్న ఆలోచన ఇందుకు కారణమా? త్వరలో చైనా అధ్యక్షుడితో భేటికి కూడా తమిళనాడులోని పురాతన ఆలయాన్ని మోదీ ఎంపికచేయడం విశేషం. ఐతే... ఈ భేటీని తమిళనాడులోని మమలియాపురంలో ఉన్న చారిత్రక శోర్ ఆలయం దగ్గర ఏర్పాటు చేస్తున్నారు.

ఇద్దరు దేశాధినేతలు వస్తుండడంతో ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. తమిళనాడు అధికారులు, పురావస్తు శాఖ సిబ్బంది, పోలీసులు వెళ్లి శోర్ ఆలయంలో ఏర్పాట్లు చూసుకుంటున్నారు. రాష్ట్ర యంత్రాంగం అంతా అక్కడే మకాం వేసింది. చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ సందర్శించనున్న చారిత్రక శోర్ ఆలయం ముస్తాబవుతోంది. వచ్చే నెలలో ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ సమావేశం నేపథ్యంలో అక్కడ ప్రత్యేకంగా ఉండే.. ఐదు రథాలను సుందరంగా అలంకరిస్తున్నారు. చుట్టు పక్కల చెట్లను ట్రిమ్మింగ్ చేస్తూ, ల్యాండ్‌స్కేప్ చేస్తున్నారు, మిరుమిట్లుగొలిపేలా విద్యుద్ధీకరణ పనులు చేపట్టారు. కీలకమైన సమ్మిట్ నేపథ్యంలో కళ్ళు జిగేల్‌మనిపించేలా ప్రపంచ స్థాయి సదుపాయాలతో శోర్ ఆలయం ముస్తాబు అవుతోంది.

అవసరమైన చోట ఫ్లోరింగ్‌ను మారుస్తున్నారు. పురావస్తు శాఖ ఉన్నతాధికారులు, నిపుణులు, కన్సల్‌టెంట్లు ఈ ప్రాంతాన్ని సందర్శించి పలు సూచనలు చేశారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేయడంతో పాటు ఐదు చారిత్రక రథాలనూ సందర్శించి.. కొంత సేపు పరిసరాల్లో కాలి నడకన తిరిగే అవకాశం ఉంది. ఇద్దరూ కలిసి కూర్చుని ఫోటోలు దిగేందుకు అనుకూలంగా బెంచిని కూడా సిద్దం చేస్తున్నారు.

తమిళనాడులో ఉన్న అత్యంత పురాతన ఆలయాల్లో ఒకటైన మమలియాపురం శోర్ ఆలయాన్ని గత నెలలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కుటుంబసమేతంగా సందర్శించారు. వెంకయ్య సూచనలతోనే మోదీ కూడా జింగ్ పింగ్ తో ద్వైపాక్షిక చర్చల వేదికను అక్కడకు మార్చినట్టు చెబుతున్నారు.

అయితే ఆలయం వద్ద అధికారులు చేపడుతున్న పనులను కొందరు విమర్శిస్తున్నారు. దేశాధినేతల పర్యటన పేరుతో ఆలయానికి ఉన్న సహజసిద్ద అందాలను ఇలా మార్చడం మంచిది కాదని పర్యావరణవేత్తలు అంటున్నారు. యధావిదిగా ఉంటేనే దానికి అందమని... ఇలా మార్పులు చేస్తే సహజత్వాన్ని కోల్పోతుందని హెచ్చరిస్తున్నారు. మొత్తానికి ఎంతో ఘన చరిత్ర ఉన్నా... రావాల్సినంత పేరు, ప్రఖ్యాతు లేని ఈ ఆలయం ఇప్పుడు టాక్ ఆఫ్ ది కంట్రీగా మారింది.

అధ్బుతమైన శిల్పకళా నైపుణ్యం.. అత్యంత పురాతన చరిత్ర ఉన్న ఆలయం శోర్ టెంపుల్. ఇక్కడకు నిత్యం వేలాది మంది పర్యాటకులు వస్తుంటారు. రాజుల కాలంలో నిర్మించిన ఆలయం ప్రత్యేకత ఏంటి? ఇక్కడ వెలసిన దేవుడు ఎవరు.? చారిత్రక నేపథ్యం ఉన్న ఆలయం. అత్యంత పురాతన చరిత్ర కలిగిన ఆలయం కూడా..

పల్లవ రాజుల కాలంలో క్రీస్తు శకం 700-728 నాటి పల్లవ రాజసింహ హయాంలో శోర్ శివాలయం నిర్మించినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. పల్లవ రాజు నరసింహవర్మన్-1 ఐదు ఏక శిల రాతితో ఐదు రథాలను తయారు చేయించినట్లు చరిత్ర చెబుతోంది. పల్లవ రాజుల కాలం నాటి చారిత్రక కట్టడాలు, ప్రపంచ వారసత్వ సంపదలుగా గుర్తించబడ్డాయన్నారు.

చెన్నైకి చేరువలో ఉండే మహాబలిపురంలో ప్రసిద్ధ చారిత్రక కట్టడాలున్నాయి. పల్లవుల పరిపాలనలో ఈ ప్రాంతం స్వర్ణయుగాన్ని చూసింది. మహాబలిపురం అంటే వెంటనే మనకు గుర్తొచ్చేది.. ఆ తీర ప్రాంతంలో వెలసిన దేవాలయమే. ఈ ఆలయం నుంచే పర్యాటకుల సందర్శన మొదలవుతుంది. భారతీయ పురాణ గాథలు, పాత్రలను తలపించే శిల్ప సౌందర్యాన్ని తనలో ఇముడ్చుకున్న ఈ ఆలయంపై అనేకమంది దేవతలు, దేవుళ్ల విగ్రహాలతోపాటు.. పలువురు నృత్య కళాకారిణుల విగ్రహాలు చెక్కబడి ఉన్నాయి.

ఈ ఆలయాలను సెవన్ పగోడాస్ అని కూడా పిలుస్తారు. ఈ ఆలయంతో పాటు ఇంకా వేరే 6 ఆలయాలు కూడా ఉండేవని అవి సముద్రంలో కలిసిపోయాయని ఆర్కియాలజీ నివేదికలు చెబుతున్నాయి. తూర్పుముఖంలో ఉన్న ప్రధాన దేవాలయంలో ధారాలింగం, శివలింగం వెనకనే శివపార్వతుల మధ్యలో సుబ్రహ్మణ్యస్వామి ఉన్నట్లు సోమస్కంధ విగ్రహం గర్భగుడి గోడల మీద చెక్కి ఉంటుంది. ఆలయం చుట్టూ నంది విగ్రహాలు బారులు తీరి ఉంటాయి. గుడి వెనుక ఒక పెద్ద రాతి సింహం, దానిపై ఓ సైనికుడు స్వారీ చేస్తున్నట్లుగా ఉండి ఆకట్టుకుంటుంది.

సముద్రపు హోరుశబ్దం వింటూ, ఆ శోర్ టెంపుల్ దగ్గర నిలుచుంటే ఆ ఆనందమే వేరు. ఆహ్లాదంగా ఆశ్చర్యపరిచేలా ఉన్న గుడి పరిసరాలను వదిలి రావాలనిపించదు. మళ్లీ మళ్లీ తిరిగి చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. అంత చారిత్రక ఆలయం మరోసారి ప్రపంచ వ్యాప్తంగా మార్మోగనుంది. ఇండియా, చైనా దేశాధినేతల చర్చలకు వేదికగా మారుతోంది. దీంతో ఆలయ కీర్తి ప్రతిష్టలు మరోసారి విశ్వవ్యాప్తం కానున్నాయి. ఇప్పటికే పర్యాటకుల మనసు దోచుకుంటున్న శోర్ టెంపుల్.. మోదీ-జింగ్ పింగ్ సమావేశం తర్వాత మరింత ప్రాచుర్యం పొంది... దేశ విదేశీ పర్యాటకులను ఆకట్టుకుంటుదనడంలో సందేహం లేదు.

Next Story

RELATED STORIES