రంగంలోకి దిగుతున్న ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ.. ఇకనుంచి..

రంగంలోకి దిగుతున్న ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ.. ఇకనుంచి..

హుజూర్ నగర్‌ ఉప ఎన్నికల పోరు హీటెక్కింది. గెలుపే లక్ష్యంగా అభ్యర్థుల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. విమర్శలు ప్రతివిమర్శలతో సవాళ్లు విసురుకుంటున్నారు. ఓటర్ల దేవుళ్లను ప్రసన్నం చేసుకునేందుకు హామీలను గుప్పిస్తున్నారు. గ్రామాల్లో ఇంటింటికి తిరుగుతూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. సీపీఐ మద్దతుతో టీఆర్‌ఎస్‌ , టీజేఎస్ మద్దతుతో కాంగ్రెస్‌, ఒంటరిగా టీడీపీ, బీజేపీ అభ్యర్ధులు తమ సత్తా చాటేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజాపార్టీ అభ్యర్థికి సీపీఎం మద్దతు ప్రకటించింది.

అటు ఉప ఎన్నికలలో సీపీఎం నామినేషన్ తిరస్కరణకు గురికావడంపై పార్టీ స్టేట్ కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధ్యులుగా పార్టీ అభ్యర్థి శేఖర్ రావుని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. CPM పార్టీ జిల్లా కార్యదర్శి రాములును కూడా బాధ్యతల నుంచి తప్పించారు. ఉపఎన్నికలో మద్దతు ఇవ్వాల్సిందిగా సీపీఎంను తెలుగుదేశం కోరింది . అయితే తెలంగాణ ప్రజాపార్టీకి మద్దతిస్తున్నట్లు ప్రకటించింది ఆ పార్టీ..

మరో వైపు హుజూర్ నగర్ ఉప ఎన్నికలో ఉనికి చాటుకునేందుకు టీడీపీ గట్టిగా ప్రయత్నిస్తోంది. సినీ హీరో ఏపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రచారానికి దిగుతున్నట్లు తెలుస్తోంది. టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న చావా కిరణ్మయికి మద్దతుగా ప్రచారం చేయనున్నారు. ఈ నెల 13వ తేదీ నుండి 18వ తేదీలోగా హుజూర్ నగర్ లో పర్యటించే అవకాశం ఉంది.

హుజూర్‌నగర్‌ ఉపఎన్నికలో కమలం వికసించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు బీజేపీ అభ్యర్థి కోటా రామారావు. ప్రచారంలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నా.. రాత్రయ్యేసరికి కాంగ్రెస్-టీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందాలు చేసుకుంటున్నారని విమర్శించారు..

మరో వైపు హుజూర్‌నగర్‌లో పోలీసులు పూర్తిగా అధికార పార్టీకి కొమ్ముకాస్తున్నారంటూ తీన్‌మార్ మల్లన్న ఆరోపించారు. ఉద్దేశపూర్వకంగానే తమ ప్రచారానికి అడుగడుగునా ఆటంకాలు కల్పిస్తున్నారని అన్నారు. పోలీసుల తీరుకు నిరసనగా హుజూర్‌నగర్ PS ముందు కళాకారులతో కలిసి ఆందోళనకు దిగారు. ఎన్నికల్లో విపక్షాల్ని కట్టడి చేసేందుకు TRS నేతలు అడ్డదారులు తొక్కుతున్నారని.. ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారని మల్లన్న విమర్శించారు.ఈ అంశంపై రిటర్నింగ్ అధికారిని కూడా కలిసి ఫిర్యాదు చేశారు అభ్యర్ధుల ప్రచారం ఇలా కొనసాగుతుంటే చాపకింద నీరులా ప్రలోభాల పర్వం మొదలైంది. పోలీసులు తనిఖీల్లో భారీగా నగదు పట్టుబడుతోంది.

Tags

Read MoreRead Less
Next Story