మూక దాడులపై ప్రధానికి లేఖ రాసిన వారిపై కేసులు

మూక దాడులపై ప్రధానికి లేఖ రాసిన వారిపై కేసులు

మూక దాడులపై ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసిన వారిపై కేసులు నమోదు చేయడం వివాదాస్పదమవుతోంది. కేసులు నమోదు చేయడాన్ని వ్యతిరేకిస్తూ మరికొంతమంది సెలబ్రిటీలు గళం విప్పారు. ప్రధానికి లేక రాసిన 49 మందికి మద్ధతుగా నిలిచారు 180 మంది ప్రముఖులు. ప్రభుత్వ చర్యపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ 180 మంది సెలబ్రిటీలు బహిరంగ లేఖ విడుదల చేశారు. దీనిపై ప్రముఖ చరిత్ర కారులు రోమిలా థాపర్, బాలీవుడ్ నటుడు నసీరుద్దీన్ షా, నృత్యకారిణి మల్లికా సారాభాయ్, సింగర్ టి.ఎం.కృష్ణ సంతకాలు చేశారు. వీరితోపాటు వివిధ రంగాలకు చెందిన మరికొందరు సెలబ్రిటీలు సంతకాలు చేసి నిరసనగళం వినిపించారు.

మూక దాడులను వ్యతిరేకిస్తూ ప్రధానికి లేఖ రాస్తే దేశద్రోహ చర్య ఎలా అవుతుందని సెలబ్రిటీలు ప్రశ్నించారు. కేసులు పెట్టి ప్రజల గొంతు నొక్కాలని చూడడం.. హక్కులను హరించడం కాదా అని నిలదీశారు. ఇప్పటికే ప్రధానికి 49 మంది రాసిన లేఖలోని ప్రతి అక్షరాన్నీ సమర్ధిస్తున్నట్లు వారు స్పష్టం చేశారు. మూక దాడులకు వ్యతిరేకంగా, ప్రజల గొంతు నొక్కడంపైనా ప్రతి రోజు తాము బహిరంగంగా మాట్లాడతామని వారు వెల్లడించారు.

దేశంలో జరుగుతున్న మూక దాడులపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఇదివరకే ప్రధానికి లేఖ రాశారు దర్శకుడు మణిరత్నం, అపర్ణసేన్, ప్రముఖ చరిత్ర కారుడు రామచంద్ర గుహతోపాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు. అయితే ఇలా లేఖలు రాయడాన్ని తప్పుబడుతూ బీహార్‌లోని ముజఫర్‌పూర్‌ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు సుధీర్ కుమార్ ఓజా అనే న్యాయవాది. వేర్పాటువాద భావజాలానికి మద్దతిస్తూ, ప్రధాని ప్రతిష్టను దిగజార్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఓజా ఆరోపించారు. దీంతో మోదీకి లేఖలు రాసిన 49 మంది సెలబ్రిటీలపై దేశద్రోహం సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వారికి మద్దతు పెరుగుతుండడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

Tags

Read MoreRead Less
Next Story