ప్రభుత్వానికి ఎయిర్‌ బస్సుపై ఉన్న ప్రేమ ఎర్రబస్సుపై లేదు - టీటీడీపీ

ప్రభుత్వానికి ఎయిర్‌ బస్సుపై ఉన్న ప్రేమ ఎర్రబస్సుపై లేదు - టీటీడీపీ

తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు సమ్మెను మరింత ఉధృతం చేసేందుకు సిద్ధమవుతున్నారు. అఖిలపక్ష నేతలతో ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నాయకులు సమావేశం నిర్వహించారు. ప్రొఫెసర్ కోదండరాం అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేశారు. రాజకీయ పార్టీలు, విద్యార్థి, ఉపాధ్యాయ, ప్రజా సంఘాలు కూడా అఖిలపక్ష భేటీకి హాజరయ్యాయి. ప్రభుత్వ తీరును రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు తీవ్రంగా తప్పు పట్టాయి. సమ్మెను నిర్వీర్యం చేసేందుకు కుట్ర జరుగుతోందని వారు ఆరోపించారు. మరోవైపు అన్ని జిల్లాల్లో రాజకీయ నాయకులతో ఆర్టీసీ ఉద్యోగులు సమావేశాలు నిర్వహించారు. కేవలం సమ్మెకు మాత్రమే మంతనాలు పరిమితం కాకుండా.. ప్రత్యక్ష పోరాటం దిశగా ముందుకు వెళ్లేందుకు ఆర్టీసీ కార్మిక సంఘాలు ప్లాన్ చేస్తున్నాయి.

ప్రజలు తమతో కలిసి రావాలని కార్మిక సంఘం నేత అశ్వత్థామరెడ్డి పిలుపునిచ్చారు. రాజకీయ పార్టీలు దశదిశ చూపాలన్నారు. అవసరమైతే తెలంగాణ బంద్‌కు పిలుపునివ్వాలని అశ్వత్థామరెడ్డి కోరారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు టీటీడీపీ మద్దతు తెలిపింది. ఆర్టీసీని నిర్వీర్యం చేయాలని కేసీఆర్‌ కుట్రలు చేస్తున్నారని ఆ పార్టీ నేత రావుల ఫైరయ్యారు. ప్రభుత్వానికి ఎయిర్‌ బస్సుపై ఉన్న ప్రేమ ఎర్రబస్సుపై లేదని ఎద్దేవా చేశారు.. ఆర్టీసీపై కేసీఆర్‌ ఈస్ట్‌మన్‌ కలర్‌ సినిమా చూపిస్తున్నారంటూ రావుల మండిపడ్డారు. ఆర్టీసీ కార్మికుల పోరాటానికి అండగా ఉంటామని సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఏకపక్ష నిర్ణయాలు మానుకోవాలంటూ విమర్శించారు.

Tags

Read MoreRead Less
Next Story