ఆంధ్రప్రదేశ్‌ స్పందన తెలియచేయాలి.. కేంద్ర హోంశాఖ

ఆంధ్రప్రదేశ్‌ స్పందన తెలియచేయాలి.. కేంద్ర హోంశాఖ
X

రాష్ట్ర విభజనకు సంబంధించిన పలు అంశాలపై కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో ఢిల్లీలో ప్ర్యతేక సమావేశం జరిగింది. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పోలీసు అధికారుల ప్రమోషన్లు, షెడ్యూల్‌ 9, 10లోని సంస్థల విభజన చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.కె.జోషి దీనికి హాజరయ్యారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా చర్చలకు నేతృత్వం వహించారు. పెండింగ్‌లో ఉన్న పోలీసు అధికారుల సీనియార్టీ అంశం సమావేశంలో ప్రస్తావనకు వచ్చినట్టు సమాచారం.

9వ షెడ్యూల్‌లోని ఆస్తుల విభజనపై కూడా సమావేశంలో చర్చ జరిగినట్టు తెలుస్తోంది. హైదరాబాద్‌లో ఉన్న ఆస్తుల విభజన జరగాలని ఏపీ మొదటి నుంచి పట్టుబడుతోంది. ఈ విషయంలో ఇద్దరు సీఎస్‌ల వాదనలను కేంద్ర హోంశాఖ కార్యదర్శి విన్నట్టు సమాచారం. ఇదే సమయంలో 68 సంస్థలకు సంబంధించి విభజనపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదంటూ తెలంగాణ ప్రభుత్వం ఒక జాబితాను సమర్పించింది. ఈ జాబితాపై ఆంధ్రప్రదేశ్‌ స్పందన తెలియచేయాలని హోంశాఖ కార్యదర్శి కోరారు.

సింగరేణి కాలరీస్‌కి సంబంధించి విభజన చట్టంలోనే లోపాలున్నాయని ఏపీ ప్రభుత్వం హోంశాఖ దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. షెడ్యూల్‌ 9 ప్రకారం సింగరేణి సంస్థను విభజించాలని, ఆస్తుల నిష్పత్తి ప్రాతిపదికన తెలంగాణకు బదలాయించాలని ఉందని కోరారు. చట్టప్రకారం ఏం చేయాలో పరిశీలించి తగిన నిర్ణయాన్ని ప్రకటిస్తామని కేంద్ర హోంశాఖ హామీ ఇచ్చినట్టు సమాచారం.

Next Story

RELATED STORIES