అర్జునుడు తపస్సు చేసిన ప్రాంతానికి జిన్‌పింగ్‌, మోదీ

అర్జునుడు తపస్సు చేసిన ప్రాంతానికి జిన్‌పింగ్‌, మోదీ
X

కాసేపట్లో చెన్నై చేరుకోనున్నారు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌. ప్రత్యేక విమానంలో చెన్నై ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోనున్న జిన్‌పింగ్‌కు ప్రధాని మోదీ సాదర స్వాగతం పలకనున్నారు. ఇప్పటికే చెన్నైకి చేరుకున్నారు మోదీ. ప్రధానికి తమిళనాడు ముఖ్యమంత్రి పళని స్వామితో పాటు మంత్రులు, అధికారులు, రాష్ట్ర బీజేపీ నేతలు ఘన స్వాగతం పలికారు.

ఈ సాయంత్రం చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో భేటీ కానున్నారు ప్రధాని మోదీ. ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ భేటీకి తమిళనాడులోని చారిత్రక పట్టణం మహాబలిపురం వేదిక కానుంది. భారత్‌, చైనా మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా వీరిద్దరి సమావేశం జరగనుంది. ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ మధ్య ఇది రెండో అనధికార సమావేశం. అగ్రనేతల భేటీ నేపథ్యంలో మహాబలిపురాన్ని సర్వంగ సుందరంగా ముస్తాబు చేశారు. ఇప్పటికే వేదిక పరిసర ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు.. భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఐదువేల మంది పోలీసులు, తాత్కాలిక ఔట్‌పోస్ట్‌లు, 800కుపైగా సీసీ కెమెరాలతో సెక్యూరిటీ కట్టుదిట్టం చేశారు. పట్టణ తీర ప్రాంతంలో రెండు కోస్ట్‌గార్డ్‌ నౌకలను మోహరించడంతో పాటు బీచ్‌లో బారికేడ్లు నిర్మించారు. మహాబలిపురం పరిసరాల్లోని 44 గ్రామాల్లో చేపల వేట నిషేధించారు.

కాసేపట్లో చెన్నై చేరుకోనున్న జిన్‌పింగ్‌... కోవలంలోని 5 స్టార్ హోటల్ తాజ్‌ ఫిషర్‌మెన్‌లో బసచేస్తారు. అక్కడ కాసేపు గడిపిన తర్వాత సాయంత్రం 4 గంటలకు మహాబలిపురానికి జిన్ పింగ్, మోదీ వేర్వేరు వాహనాల్లో వెళ్తారు. వీరిద్దరూ కలిసి అర్జునుడు తపస్సు చేసిన ప్రాంతం, పంచ పాండవుల రథాలు, సముద్రం ఒడ్డున ఉన్న ఆలయాన్ని సందర్శిస్తారు. ఆ తరువాత సీషోర్ టెంపుల్‌లో సమావేశం అవుతారు. స్థానిక జాలర్లు, విద్యార్థులతో ముచ్చటిస్తారు. అక్కడే సాంస్కృతిక ప్రదర్శనలను తిలకించిన అనంతరం.. జిన్‌పింగ్‌ గౌరవార్థం మోదీ విందు ఇవ్వనున్నారు. ఆ తరువాత ఇద్దరు తిరిగి చెన్నై హోటల్‌కు వెళ్తారు. శనివారం ఉదయం జిన్‌పింగ్‌-మోదీ మరోసారి సమావేశం అవుతారు. రేపు మధ్యాహ్నం ఒంటి గంట 30 నిమిషాలకు పర్యటన పూర్తి చేసుకొని తిరిగి చైనాకు వెళ్లిపోతారు జిన్‌పింగ్‌.

మోదీ, జిన్‌పింగ్‌ భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇద్దరు మొదటిసారి చైనాలోని వుహాన్‌లో గతేడాది ఏప్రిల్‌లో అనధికారికంగా సమావేశమయ్యారు. డోక్లాంలో భారత్‌, చైనా సైన్యాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఆ భేటీ జరిగింది. ప్రస్తుతం ఆర్టికల్‌ 370 రద్దుపై పాకిస్థాన్‌కు చైనా అండగా నిలుస్తున్న నేపథ్యంలో మోదీ, జిన్‌పింగ్‌ మధ్య రెండోభేటీ జగరడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఆర్టికల్ 370 రద్దు తర్వాత భారత్-పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అవకాశం దొరికిన ప్రతిసారి భారత్‌పై అక్కసును వెళ్లగక్కుతోంది పాకిస్తాన్. అయితే అంతర్జాతీయ వేదికలతోపాటు..చివరికి ఐక్యరాజ్యసమితిలోనూ మద్దతు కూడగట్టడంలో పాక్‌ ఘోరంగా విఫలమైంది. అయితే చైనా ఒక్కటే పరోక్షంగా పాకిస్తాన్‌కు మద్దతు తెలుపుతూ వచ్చింది. వీలు చిక్కినప్పుడల్లా భారత్‌ను ఇరుకునపెట్టే ప్రయత్నం చేసింది. ఈ నేపథ్యంలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ భారత పర్యటనలో కశ్మీర్ అంశం చర్చకు వస్తుందా రాదా అన్నది ఆసక్తి రేపుతోంది. ఇది అధికారిక సమావేశం కాకపోయినా రెండు దేశాల మధ్య ఉన్న మౌలిక అంశాలను మోదీ ప్రస్తావిస్తారని దౌత్యవర్గాలు తెలిపాయి. మరో విశేషమేంటంటే జిన్‌పింగ్ రాకకు ముందే.. చైనా కశ్మీర్‌ విషయంలో స్వరాన్ని తగ్గించింది. కశ్మీర్‌ వ్యవహారాన్ని భారత్‌-పాక్‌లు రెండూ ద్వైపాక్షికంగానే తేల్చుకోవాలని స్పష్టం చేసింది. ఐక్యరాజ్యసమితిలో కశ్మీర్‌పై పాక్‌కు అండగా నిలిచిన చైనా.. ఇప్పుడు తన స్వరాన్ని మార్చడం భారత్‌కు దౌత్య విజయమేనని అంటున్నారు విశ్లేషకులు.

వుహాన్‌ భేటీ తర్వాత భారత్‌, చైనా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలు మరింతగా పెరిగాయి. సరిహద్దుల్లో శాంతిని నెలకొల్పడానికి అంగీకరించారు. మహాబిపురం భేటీతోనూ ఇలాంటి సానుకూల ఫలితాలు రావచ్చని భావిస్తున్నారు. ఉగ్రవాదం, వాతావరణ మార్పులు, ఇండో-పసిఫిక్‌ సమ్మిళిత అభివృద్ధి తదితర అంశాలపై చర్చిస్తారని సమాచారం. జిన్‌పింగ్‌ కశ్మీర్‌ అంశాన్ని ప్రస్తావించకపోవచ్చని.. ఒకవేళ ఆయన అడిగితే.. మోదీ ప్రస్తుత పరిస్థితిని, భారత్‌ వైఖరిని వివరిస్తారని తెలుస్తోంది. అయితే ఇరు దేశాల మధ్య ఎలాంటి ఒప్పందాలు, సంయుక్త అధికారిక ప్రకటనలు ఉండవని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కేవలం ఉభయదేశాల ప్రజల మధ్య సంబంధాల్ని మరింత ముందుకు తీసుకెళ్లడంలో భాగంగానే ఈ భేటీ జరుగుతుందన్నారు.

Next Story

RELATED STORIES