తాజా వార్తలు

నగరంలో నరకమే.. GHMC పై పోలీస్ కంప్లైంట్..

నగరంలో నరకమే.. GHMC పై పోలీస్ కంప్లైంట్..
X

భాగ్యనగరంలో కుండపోత వానలు కొనసాగుతున్నాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో నిన్న సాయంత్రం భారీ వర్షం కురిసింది. పలు రహదారులు చెరువులను తలపించాయి. వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడ్డారు. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించింది. అల్వాల్‌లోని టెలికాం కాలనీలో అత్యధికంగా 10.6 సెం.మీ వర్షం కురిసింది.

హైదరాబాద్‌లో గత కొద్ది రోజులుగా కుండపోత వానలు కురుస్తున్నాయి. అమీర్‌పేట, బేగంపేట, ఖైరతాబాద్‌, బంజారాహిల్స్‌, మియాపూర్‌, జేఎన్‌టీయూ, సికింద్రాబాద్‌, కవాడిగూడ, పద్మారావు నగర్, రాంనగర్, బోయిన్‌పల్లి, అల్వాల్‌, ఉప్పల్‌, తార్నాక, మల్కాజ్‌గిరి, కుషాయిగూడ, ఎల్బీనగర్‌ ప్రాంతాల్లో వర్షం కురిసింది. డ్రైనేజీలన్నీ పొంగిపొర్లాయి. ఖైరతాబాద్ కూడలి, ఎల్బీనగర్‌ చౌరస్తా, జేఎన్‌టీయూ వద్ద భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

వర్షం పడితే చాలు నగరంలో నరకం కనపడుతోంది. భారీ వర్షాలకు రోడ్లపై మోకాలి లోతు గుంతలు పడుతున్నా.. వాటిని పూడ్చిన దాఖలాలే కనిపించడం లేదు. ఈ వైఖరినే ప్రశ్నిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు పాతబస్తీ వాసి. డబీర్‌పురా ప్రాంతానికి చెందిన సయీద్‌ అజ్మత్‌ హుస్సేన్‌ జాఫ్రి బైక్‌పై వెళ్తుండగా... రోడ్డుపై ఉన్న గుంతలో పడిపోయాడు. ఈ ఘటనలో జాఫ్రి కాలు ఫ్యాక్చర్‌ అయింది. GHMC నిర్లక్ష్య వైఖరి వల్లే తను తీవ్రంగా గాయపడ్డానని ఆరోపిస్తూ... ఆయన డబీర్‌పురా పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

అటు తెలంగాణలోని పలు జిల్లాల్లోనూ భారీ వర్షం పడింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తంగళ్లపల్లి, ఎల్లారెడ్డిపేట మండలాలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లందు, సిద్ధిపేట, నిజామాబాద్ భీంగల్ మండలం, జనగామ జిల్లాలోని బచ్చన్నపేట మండలంలోని పలు గ్రామాల్లో భారీ వర్షం కురిసింది.

Next Story

RELATED STORIES