లంచాలు తీసుకునేందుకు కొత్తగా ఆలోచించిన మహిళా అధికారి.. చివరకు..

లంచాలు తీసుకునేందుకు కొత్తగా ఆలోచించిన మహిళా అధికారి.. చివరకు..

ఇదిగో ఈ నగల షాపులో షాపింగ్ చేస్తున్న మహిళను గమనించండి. పేరు బొమ్మిశెట్టి లక్ష్మీ. జంట నగరాల జోన్ కు డ్రగ్ ఇన్‌స్పెక్టర్. ఆఫీసర్ హోదాలో ఉన్నబంగారం షాపింగ్ ఓ హాబీలా మారిపోయింది. ఇంత కాస్ట్‌లీ హాబీ ఎంటని అనుకుంటున్నారా? ఎందుకంటే ఆమె షాపింగ్ చేసేది ఆమె డబ్బుతో కాదు. లంచాలు తీసుకునేందుకు ఈ డ్రగ్ ఇన్‌స్పెక్టర్ ఎంచుకున్న ఈజీ రూట్.

లింగంపల్లి లక్ష్మీరెడ్డి అనే మహిళ.. 15 ఏళ్లుగా బోయిన్‌పల్లిలో జనని వాలంటరీ పేరుతో బ్లడ్‌ బ్యాంక్‌ను నిర్వహిస్తోంది. అయితే ఇటీవల తనిఖీల సందర్భంగా రికార్డ్స్‌లో దాతల వివరాలు సరిగా లేకపోవడంతో పాటుగా రక్తం నిల్వ చేసిన గదిలో ఏసీ పని చేయడం లేదని డీఐ లక్ష్మీ గుర్తించారు. కేసు నమోదు చేసిన డీఐ..బ్లండ్‌ బ్యాంక్‌ను సీజ్‌ చేయకుండా ఉండాలంటే తనకు 2 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్‌ చేసింది. అంతమొత్తం ఇచ్చుకోలేనని, నోటీసులిస్తే లోపాలను సరిదిద్దుకుంటానని లక్ష్మీరెడ్డి వేడుకుంది. అయితే.. తమకు కూడా టార్గెట్లు ఉన్నాయన్న డ్రగ్ ఇన్స్ పెక్టర్, పై అధికారులకు డబ్బులు ముట్టజెప్పాలని, అడిగినంత ఇవ్వాల్సిందేనంటూ డీఐ హుకుం జారీ చేసింది.

దీంతో బాధితురాలు లక్ష్మీరెడ్డి ఏసీబీని ఆశ్రయించింది. అవినీతి అధికారిపై అప్పటికే పలు ఫిర్యాదులు అందడంతో నిఘా పెట్టిన ఏసీబీ అధికారులు..లక్ష్మీకు కొన్ని సూచనలు చేశారు. ముందుగా వేసుకున్న ప్లాన్‌ ప్రకారం..బాధితురాలు.. డ్రగ్స్‌ అధికారితో మాట్లాడింది. అడిగినంత ఇస్తానని ఒప్పుకుంది. అయితే, డీఐ నగదు రూపంలో కాకుండా బంగారు ఆభరణాల రూపంలో కావాలని ఆమెను కోరింది. అప్పటికే ఏసీబీకి సమాచారం ఇచ్చిన బ్లండ్‌ బ్యాంక్‌ నిర్వాహకురాలు.. ఏసీబీ సూచనల మేరకు.. అబిడ్స్‌లోని ఓ బంగారు దుకాణానికి రప్పించింది. అక్కడ లక్షా పది వేల రూపాయల విలువ చేసే బంగారు గొలుసు ఆభరణాన్ని ఎంపిక చేసుకుంది డీఐ. అయితే.. ప్రస్తుతం తనవద్ద ఇంత డబ్బుల్లేవని, ఇదే బంగారు గొలుసును మరుసటి రోజు తెచ్చి ఇస్తానని చెప్పి, డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ను పంపించేసింది లక్ష్మీరెడ్డి. అలా ఆమె షాపింగ్‌ చేస్తున్న దృశ్యాలు తన స్పై కెమెరాలో చిత్రీకరించి.. ఆ విజువల్స్‌ను ఏసీబీకి ఇచ్చింది బాధితురాలు. ఈ స్టింగ్‌ ఆపరేషన్‌ విజువల్స్‌ టీవీ5 సంపాదించించింది.

ఆ తరువాత ఆ గొలుసుకు డబ్బులు చెల్లించి, షాపు నుంచి బిల్లు తీసుకుంది. డీఐకి బంగారు గొలుసును ఇచ్చేందుకు లక్ష్మీరెడ్డి మధురానగర్‌ సూర్య అపార్ట్‌ మెంట్‌కు వెళ్లింది. డ్రగ్‌ ఇన్స్‌పెక్టర్‌ బొమ్మిశెట్టి లక్ష్మికి బంగారు గొలుసును అందజేస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇదే సమయంలో ఆమె నుంచి పలు నగలను కూడా సీజ్‌ చేసినట్లు తెలిసింది. నగల రూపంలో లంచాలు తీసుకుంటున్న ఈ అవినీతి అధికారి పాపం ఇన్నాళ్లకు ఇలా బయటపడింది.

Tags

Read MoreRead Less
Next Story