కోహ్లీ రికార్డుల మోత

కోహ్లీ రికార్డుల మోత

టీమిండియా మరో ఆల్ రౌండ్ షో అదరగొట్టేసింది. బ్యాట్స్ మెన్, బౌలర్లు, ఫీల్డర్లు అద్భుత ప్రదర్శన కనబరచిన వేళ రెండో టెస్టులో ఇన్నింగ్స్ 137 పరుగులతో ఘన విజయం సాధించింది. మూడు టెస్టుల సిరీస్ ను మరో మ్యాచ్ ఉండగానే 2-0తో సొంతం చేసుకుంది. అంతేకాదు స్వదేశంలో వరుసగా 11వ సిరీస్ విజయంతో టీమిండియా వరల్డ్ రికార్డ్ సృష్టించింది.

విశాఖపట్నం టెస్టు విక్టరీకి మరింత పదనుపెట్టినట్టు పుణే టెస్టులో మరింత చెలరేగిపోయిన కోహ్లీ రికార్డుల మోత మోగించాడు. డబుల్ సెంచరీతో పాటు కెప్టెన్‌గా ఏడెనిమిది రికార్డులు సృష్టించాడు కోహ్లీ. దుందుడుకు స్వభావం అనే విమర్శలు ఉన్నా.. కెప్టెన్ గా కోహ్లీ మరింత రాటుదేలిపోతున్నాడని విమర్శకులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. ఫీల్డర్ల మోహరింపు, ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసిన విధానం, బౌలింగ్‌లో మార్పు చేర్పులు అన్నీ అతడి సారథ్య నైపుణ్యాన్ని చాటుచెబుతున్నాయని అంటున్నారు.

కెప్టెన్ ఇన్నింగ్స్ కు ప్లేయర్ల ఆల్ రౌండ్ షో జత కలవటంతో టీమిండియా ముందు సౌతాఫ్రికా బలం పసికూనల్లా మారిపోయింది. ఏకంగా ఇన్నింగ్స్ 137 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిపోయింది. స్వదేశంలో టీమిండియాకిది వరుసగా 11వ టెస్ట్‌ సిరీస్‌ విజయం. 2012-13లో భారత్‌ విజయపరంపర ప్రారంభమైంది. 10 వరుస టెస్ట్‌ సిరీస్‌ విజయాలతో ఆస్ట్రేలియా పేరిట ఉన్న రికార్డును భారత్‌ బద్దలు కొట్టింది.

2012-13 నుంచి ఇప్పటిదాకా టీమిండియా స్వదేశంలో 31టెస్ట్ మ్యాచ్ లు ఆడింది. ఇందులో 25 విజయాలు సాధించి మరో అరుదైన రికార్డు సృష్టించింది. గెలుపు ఓటముల రికార్డు 25 -1తో ఈ స్థాయి ప్రదర్శన చేయగలిగిన ఏకైక జట్టుగా నిలిచింది. ఆ ఒక్క ఓటమి కూడా పూణే మైదానంలోనే ఎదురైంది. 2017లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో టీమిండియా ఓటమిపాలైంది. స్వదేశీ సిరీస్ లలో గత ఏడేళ్లలో ఏకైక టెస్ట్ మ్యాచ్ ఓడిపోయిన పుణే మైదానంలో రెండేళ్లు తిరగకుండానే కోహ్లీ సేన ఘన విజయం సాధించింది.

50వ టెస్ట్ కు కెప్టెన్ గా వ్యవహరించిన కోహ్లీకి ఇది మరింత చిరస్మరణీయ మ్యాచ్ గా నిలిచింది. ఆట రెండో రోజున అద్భుత బ్యాటింగ్ తో అలరించి 254 నాటౌట్ పరుగులతో కెప్టెన్ కోహ్లీ ఏకంగా ఎనిమిది బ్యాటింగ్ రికార్డులను నెలకొల్పాడు. ఈ విజయంతో మూడు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ ను 2- 0 తో కైవసం చేసుకోవడమే కాకుండా.. దక్షిణాఫ్రికా జట్టును ఫాలో ఆన్ ఆడించిన మొదటి భారత జట్టు కెప్టెన్ గా కోహ్లీ నిలిచాడు. పదకొండేళ్ల కిందట లార్డ్స్ టెస్టులో ఇంగ్లాండుపై ఫాలో ఆన్ ఆడిన దక్షిణాఫ్రికా ముగ్గురు బ్యాట్స్ మెన్ సెంచరీలు చేయడంతో ఆ మ్యాచ్ ను డ్రా చేయగలిగింది. కానీ, పుణేలో మాత్రం కోహ్లీ టీం దక్షిణాఫ్రికాకు అంత సీన్ ఇవ్వలేదు.

ఇక వరల్డ్ టెస్ట్ క్రికెట్ ఛాంపియన్ షిప్ లో ఇప్పటికే పాయింట్ల పరంగా అగ్రస్థానంలో నిలిచిన భారత జట్టు ఈ మ్యాచ్ విజయంతో మరే జట్టుకు అందనంత ఎత్తులో నిలిచింది. ఇప్పటికే 160 పాయింట్లతో నెంబర్ వన్ స్థానంలో ఉన్న టీమిండియా ఈ విజయంతో తన పాయింట్ల సంఖ్యను 200 లకు పెంచుకుంది. ఈ ఏడాదే కొత్తగా ప్రవేశపెట్టిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో రెండో స్థానంలో ఉన్న న్యూజిలాండ్.. భారత్ తో పోలిస్తే 140 పాయింట్ల తేడాతో ఉందంటే టెస్టులలో కోహ్లీ సేన విజృంభణ ఏ స్థాయిలో ఉందో క్లారిటీ వస్తుంది.

Tags

Read MoreRead Less
Next Story