కుమార్తెను పాతిపెట్టడానికి వెళ్తే.. మట్టికుండలో బ్రతికున్న శిశువు దొరికింది

కుమార్తెను పాతిపెట్టడానికి వెళ్తే.. మట్టికుండలో బ్రతికున్న శిశువు దొరికింది
X

పుట్టిన కొద్ది నిమిషాలకే మరణించిన తన సొంత కుమార్తెను పాతిపెట్టడానికి వెళ్లిన ఓ తండ్రికి మట్టికుండలో పాతిపెట్టిన నవజాత శిశువు దొరికింది. హితేష్ కుమార్ సిరోహి అనే వ్యాపారి ఆ నవజాత బాలికను రక్షించి, శిశువుకు పాలను పట్టి.. వెంటనే ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది. బరేలీ సూపరింటెండెంట్ అఫ్ పోలీసు అభినందన్ సింగ్ వెల్లడించిన వివరాల ప్రకారం, సిరోహి భార్య వైశాలి ప్రసవ నొప్పులతో ఆమెను గత వారం ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. దాంతో ఆమె ఏడు నెలలకే ఆడ శిశువుకు జన్మనిచ్చింది, దురదృష్టవశాత్తు కొద్ది నిమిషాల్లోనే ఆ శిశువు మరణించింది. దీంతో వైశాలి భర్త సిరోహి తన కుమార్తెను పాతిపెట్టడానికి స్మశానానికి తీసుకెళ్లాడు.

ఈ క్రమంలో గొయ్యి తవ్వుతున్నప్పుడు.. మూడు అడుగుల లోతులో గడ్డపలుగు మట్టి కుండను తాకింది.. ఏంటా అని చూసి ఆ మట్టికుండను బయటకు తీసి చూడగా.. అందులో బ్రతికున్న ఆడ శిశువు కనిపించింది. ఆ శిశువు సజీవంగా ఉందని.. ఊపిరి కూడా పీల్చుకుంటుండటంతో వెంటనే.. పాపకు పలు పట్టించి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆ శిశువు పరిస్థితి ఇప్పుడు స్థిరంగా ఉంది. అనంతరం పోలీసులకు సమాచారం అందించాడు. స్వయంగా రంగంలోకి దిగిన బరేలి ఎస్పీ.. పసికందును సజీవంగా సమాధి చేయడానికి ప్రయత్నించిన తల్లిదండ్రుల వివరాలు సేకరించే పనిలో పడ్డారు. కాగా ఆ పసికందు చికిత్స బాధ్యతను స్థానిక బీజేపీ ఎమ్మెల్యే రాజేష్ మిశ్రా తీసుకున్నారు. మరోవైపు, ఓ వ్యాపారి ఆ పాపను దత్తత తీసుకోవడానికి ముందుకొచ్చాడు.

Next Story

RELATED STORIES