దీపావళి పండగ.. నగల వ్యాపారులకు కలిసి రావడంలేదా?

దీపావళి పండగ.. నగల వ్యాపారులకు కలిసి రావడంలేదా?

దీపావళి వచ్చేస్తోంది. మామూలుగా అయితే ఇప్పటికే నగల దుకాణాలు కళకళలాడాలి. కొనుగోళ్లతో వెలిగిపోవాలి. కానీ ఈసారి ఆ పరిస్థితి కనిపించడం లేదు. అమ్మకాలు లేక జ్యువెలరీ షాప్స్‌ వెలవెల బోతున్నాయి. పండుగ వెలుగులు లేక బోసిపోతున్నాయి. చుక్కలనంటుతున్న బంగారం ధరలకు... ఆర్థిక మందగమనం ఎఫెక్ట్ కూడా తోడైంది.

ఈ సంవత్సరం ధనత్రయోదశి, దీపావళి పండగలు నగల వ్యాపారులకు కలిసొచ్చేలా కనిపించడం లేదు. ప్రస్తుతం పసిడి ధర గత ఏడాదితో పోలిస్తే దాదాపు 5 వేలు ఎక్కువగా ఉంది. దీంతో ఈ ఏడాది ఈ రెండు పండగల సమయంలో నగల విక్రయాలు 30 శాతం వరకు తగ్గే అవకాశం ఉందని అంచనా. నెల రోజుల క్రితం 10 గ్రాముల బంగారం దర 40 వేల వరకు పలికింది. ప్రస్తుతం 37 వేల నుంచి...38 వేల మధ్య ట్రేడవుతోంది. సంపన్నులు మినహా మధ్య తరగతి ప్రజలెవరూ ఇంత ధర పెట్టి నగల కొనుగోలుకు ముందుకు రావడం లేదని నగల వ్యాపారులు చెబుతున్నారు. దీపావళి నాటికి పసడి ధర మరింత తగ్గితే తప్ప, మధ్య తరగతి ప్రజలు నగల కొనుగోలుకు పెద్దగా ముందుకు రాకపోవచ్చని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి..

ఆర్థిక మందగమనం కారణంగా గత ఏడాదితో పోలిస్తే ప్రజల ఆదాయాలు బాగా తగ్గాయి. ఆ ప్రభావం ఈ సంవత్సరం దీపావళి అమ్మకాలపై తప్పకుండా ఉంటుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి..2017 జనవరి నుంచి ఈ సంవత్సరం జూన్‌ వరకు పసిడి దిగుమతుల్లో వృద్ధి రేటు నమోదయ్యేది. ఈ సంవత్సరం జూలై, ఆగస్టులో మాత్రం గత ఏడాదితో పోలిస్తే దిగుమతులు 60 శాతం పడిపోయాయి.

మన దేశంలో పసిడి ధర ఏ స్థాయిలో స్థిరపడుతుందనే విషయం... డాలర్‌తో రూపాయి మారకం రేటుపై ఆధారపడి ఉంటుంది. నెల రోజుల క్రితం వరకు పరుగెత్తిన పసిడి ధర అంతర్జాతీయ మార్కెట్లోనూ ఇప్పుడు కింది చూపులు చూస్తోంది. వాణిజ్య యుద్ధానికి తెరదించేందుకు అమెరికా-చైనా చేస్తున్న ప్రయత్నాలు, అమెరికా కేంద్ర బ్యాంక్‌ ఫెడ్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్లు తగ్గించడం ఇందుకు ప్రధాన కారణం. ఈ రెండు చర్యలతో అమెరికా కరెన్సీ

డాలర్‌ మారకం రేటు పెరిగింది. దీంతో డాలర్‌ మారకంలో రూపాయి మళ్లీ 71 స్థాయిని అధిగమించింది. ఇది మరింత పెరిగితే ఆ ప్రభావం పసిడి ధరపైనా పడి దీపావళికి నగల అమ్మకాలను దెబ్బతీసే అవకాశం ఉందని మార్కెట్‌ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story