దుమారం రేపుతున్న మహారాష్ట్ర బీజేపీ మేనిఫెస్టో

దుమారం రేపుతున్న మహారాష్ట్ర బీజేపీ మేనిఫెస్టో

హిందూ హృదయ సామ్రాట్‌గా పేరొందిన వీర సావర్కార్‌ను కమలదళం మళ్లీ తెరపైకి తీసుకొచ్చింది. ఆర్ఎస్ఎస్ సైద్ధాంతిక నేతగా సవార్కర్ ను గుండెల్లో పెట్టుకొని కొలుకుంటుంది బీజేపీ. అయితే..బాపూజీ గాంధీ హత్యలో సావర్కర్ కు కూడా ప్రమేయం ఉందనే వాదన ఉంది. అయితే.. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా మేనిఫెస్టో విడుదల చేసిన బీజేపీ.. సావర్కర్ కు భారతరత్న సాధించటమే లక్ష్యంగా కృషి చేస్తామని హామీ ఇచ్చింది. అలాగే సంఘ సంస్కర్తలు జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలేలకు కూడా భారతరత్న కోసం కృషి చేస్తామని మేనిఫెస్టోలో ప్రామిస్ చేసింది బీజేపీ.

మహారాష్ట్రలో బీజేపీ మేనిఫెస్టో కమలాన్ని చిక్కుల్లోకి నెట్టాయి. సావర్కర్.. మహాత్మాగాంధీ హత్య కేసులో నేర విచారణను ఎదుర్కున్నారన్నది కాంగ్రెస్ వాదన. కపూర్ కమిషన్ కూడా ఆ ఆరోపణపై ఇన్విస్టిగేట్ చేసింది. సావార్కర్ ప్రమేయంపై కమిషన్ అనుమానాలు కూడా వ్యక్తం చేసిందని గుర్తు చేసిన కాంగ్రెస్.. గాంధీ హత్యలో ప్రమేయం ఉన్న వ్యక్తికి భారత రత్నతో గౌరవిస్తారా? అని ప్రశ్నించారు.

అటు సీపీఐ కూడా మహారాష్ట్ర బీజేపీ తీరుపై ఆగ్రహంతో ఉంది. సావర్కర్ కు భారత రత్న వచ్చేలా కృషి చేస్తామని హామీ ఇవ్వటం దేశ రాజకీయాల్లో అత్యంత తీవ్ర పరిణామంగా సీపీఐ అభివర్ణించింది. ఓ వైపు గాంధీ 150వ జయంతి ఉత్సవాలు నిర్వహిస్తూనే మరోవైపు గాంధీ హత్యలో నిందితుడైన సావర్కర్‌కు భారతరత్న ఎలా ఇస్తారని ప్రశ్నించారు. అంతేకాదు..కొన్నాళ్ల తర్వాత గాంధీని హత్య చేసిన గాడ్సేకి కూడా భారతరత్న ఇస్తామంటారేమోనని అన్నారు.

సావర్కర్‌కు భారతరత్న సాధిస్తామంటూ ఎన్నికల మేనిఫెస్టోలో బీజేపీ ప్రకటించడాన్ని మజ్లిస్ తప్పుబట్టింది. రెండు దేశాల సిద్ధాంతానికి సావర్కర్ మద్దతిచ్చాడని, గాంధీ హత్యకేసులో సావర్కర్‌ ప్రమేయంపై జీవన్ లాల్ కమిషన్‌ సైతం అనుమానం వ్యక్తం చేసిందని ఎంఐఎం గుర్తుచేసింది.

Tags

Read MoreRead Less
Next Story