అంత్యక్రియల సమయంలో అప్పటి వరకు ఏడుపులు.. అంతలోనే నవ్వులు.. వీడియో

ఆప్తులు మరణిస్తే ఆ ఇంట్లో విషాదం నెలకొంటుంది. అంత్యక్రియల సమయంలో అందరూ శోక సంధ్రంలో మునిగిపోతారు. ఆ వ్యక్తితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ.. గుండెలవిసేలా రోదిస్తారు. అప్పటి వరకు తమ మధ్యలోనే ఉన్న వ్యక్తి ఒక్కసారిగా దూరమవడాన్ని తట్టుకోలేకపోతారు. విషణ్ణ వదనాలతో అంత్యక్రియలకు సమాయత్తమవుతారు. బాధని మౌనంగా భరిస్తూ కార్యక్రమాలను పూర్తి చేస్తారు. కానీ ఐర్లాండ్‌కు చెందిన మాజీ సైనికుడు మరణిస్తే అంత్యక్రియల సమయంలో అప్పటి వరకు ఏడ్చిన వారంతా ఒక్కసారిగా నవ్వడం మొదలు పెట్టారు.
అదే మరణించిన వ్యక్తి కోరుకున్నది. అదే అతడి చివరి కోరిక. నేను పోతే ఎవరూ బాధపడకూడదు. నన్ను ఏడుస్తూ సాగనంపకూడదు. మీరంతా నవ్వుతూ ఉండాలి. అదే నాకు ఆత్మసంతృప్తిని ఇస్తుంది అని తానే అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేసుకుని మరీ మరణించారు. కిల్మనాగ్‌లో నివసిస్తున్న శాయ్ బ్రాడ్లీ అనే మాజీ సైనికుడు శనివారం మరణించారు. బంధుమిత్రులు అంత్యక్రియలు నిర్వహించారు. ఆయన భౌతిక కాయాన్ని శవపేటికలో పెట్టి గోతిలో పాతిపెట్టారు. బ్రాడ్లీ కోరిక మేరకు ఆయన వాయిస్‌తోనే రికార్డు చేసిన ఓ ఆడియోను అక్కడ ఉంచారు.
అందులోనుంచి 'టక్ టక్ టక్' అనే శబ్దం వినిపిస్తూ ఆడియో మొదలైంది. ' నేను ఎక్కడ ఉన్నాను.. నన్ను బయటకు తీయండి.. ఇక్కడ చాలా చీకటిగా ఉంది.. అక్కడ ప్రవక్త ఉన్నారా.. ఆయనతో మాట్లాడవచ్చా.. నేను శాయ్‌ను మాట్లాడుతున్నా.. నేను శవపేటికలో ఉన్నా.. కాదు.. కాదు.. నేను మీ ముందే ఉన్నా.. నేను చనిపోయా' అనే మాటలు వినిపించాయి. ఆ మాటలు బ్రాడ్లీ తన మరణానికి ముందే రికార్డు చేసి పెట్టారు. మరణానంతరం అంత్యక్రియల సమయంలో అక్కడ ఉంచమని.. ఆ సమయంలో ఎవరూ బాధపడవద్దని ఇంట్లో వారికి ముందే చెప్పి ఉంచారు. ఇదంతా తెలియని బంధువులు, మిత్రులు తమ ఆప్తుడి మాటలు వినిపించే సరికి ఒకింత ఆశ్చర్యంగా అనిపించి అంతలోనే నవ్వడం మొదలు పెట్టారు. అదే బ్రాడ్లీ కోరుకుంది. దాంతో ఆయన ఆత్మకు ప్రశాంతత కలుగుతుందని సంతోషించారు బ్రాడ్లీ ఆప్తమిత్రులు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com