ఆర్టీసీ సమ్మె.. హైకోర్టు ఆదేశాలపై సీఎం కేసీఆర్‌ రివ్యూ

ఆర్టీసీ సమ్మె.. హైకోర్టు ఆదేశాలపై సీఎం కేసీఆర్‌ రివ్యూ

ఆర్టీసీ సమ్మె విషయంలో హైకోర్టు ఆదేశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ రివ్యూ చేశారు. క్యాంప్ ఆఫీస్‌లో మంత్రి పువ్వాడ అజయ్, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ, ఇతర అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం ఐదు గంటలపాటు సాగింది. రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మె, హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు, తర్వాత తీసుకోవాల్సిన చర్యలపై సీఎం చర్చించారు. ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాలని.. సమ్మె విరమింపచేయాలని హైకోర్టు ప్రభుత్వానికి సూచించడంపై అధికారులతో మాట్లాడారు. ఆల్టర్ నేట్ యాక్షన్ ప్లాన్ పై చర్చించారు. మరోవైపు.. ఆర్టీసీకి ఎండీ నియామకంపైనా ఓ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.

అంతకు ముందు హైకోర్టు సూచనల నేపథ్యంలో మంత్రి పువ్వాడ అజయ్ ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఖైరతాబాద్ లోని రవాణా శాఖ కార్యాలయంలో ఆర్టీసీ డిపో మేనేజర్లు, అధికారులతో ఆయన చర్చించారు. బస్సులన్నీ పూర్తి స్థాయిలో నడిచేలా చూడాలని సూచించారు. ప్రజా రవాణాకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ నెల 21 నుంచి విద్యా సంస్థలు పునఃప్రారంభం కానుండటంతో అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. జిల్లాల్లో నూరు శాతం బస్సుల్ని నడుపుతున్నా.. హైదరాబాద్ లో మాత్రం 40శాతం బస్సులే అందుబాటులో ఉన్నట్లు అధికారులు మంత్రికి తెలిపారు. దీంతో హైదరాబాద్ లోనూ బస్సులన్నీ నడిపేలా చర్యలూ చేపట్టాలని ఆదేశించారు మంత్రి. అనుభవజ్ఞులైన డ్రైవర్ల కొరత లేకుండా చూడాలన్నారు.

మరోవైపు.. ఆర్టీసీ సమ్మె యథాతథంగా కొనసాగుతుందని జేఏసీ ప్రకటించింది. చర్చలపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆహ్వానం అందలేదని తెలిపారు. సమ్మెపై హైకోర్టు ఆదేశాలు, భవిష్యత్‌ కార్యాచరణపై అఖిలపక్షనేతలతో చర్చించారు జేఏసీ నేతలు. ఈ సమావేశానికి ప్రొఫెసర్‌ కోదండరామ్‌, చాడ వెంకట్‌రెడ్డి, తమ్మినేని వీరభద్రం, రావుల చంద్రశేఖర్ రెడ్డి హాజరయ్యారు. 19న తెలంగాణ బంద్‌కు అన్ని ప్రజా సంఘాలు మద్దతివ్వాలని జేఏసీ నేతలు కోరారు. అరెస్ట్‌ చేసిన ఆర్టీసీ కార్మికులను తక్షణమే విడుదల చేయాలన్నారు. అటు సమ్మెకు తెలంగాణ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌, ఆలిండియా రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కోఆర్డినేషన్‌ మద్దతు తెలిపాయి.

ఇక ఆర్టీసీ కార్మికులకు సెప్టెంబర్ నెల వేతనాలు అందకపోవడంపై హైకోర్టులో విచారణ జరిగింది. సిబ్బంది సమ్మె కారణంగానే.. చెల్లింపుల్లో ఆలస్యమైందని యాజమాన్యం కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. ప్రస్తుతం సమ్మె కొనసాగుతున్నందున సిబ్బంది లేరని తెలిపింది. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు సోమవారంలోపు వేతనాల చెల్లింపు ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించింది.

Tags

Read MoreRead Less
Next Story