ప్రధాని అపాయింట్‌మెంట్ కోరిన చిరంజీవి

సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన తరువాత బ్యాక్ టు బ్యాక్ హిట్టులతో చిరంజీవి సూపర్ ఫాంలో ఉన్నారు. సైరా మూవీతో రికార్డులు కొల్ల గొడుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా సినిమాపై ప్రశంసలు కురుస్తున్నాయి. మరోవైపు చిరంజీవి సైతం స్వయంగా తన సినిమాను ప్రమోట్ చేసుకుంటున్నారు. స్వయంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుని కలిశారు. ఆయన నివాసంలోనే ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా ప్రదర్శించారు.
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్రపై సినిమా తీయడం చాలా గొప్ప నిర్ణయమన్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. భారతదేశం స్వరూపాన్ని, వలస పాలకుల నియంతృత్వ పాలన గురించి ఈ సినిమాలో చక్కగా చూపించారని అభిప్రాయపడ్డారు.
ఆ రోజుల్లో రామారావు, నాగేశ్వరావు తరువాత మూడో జనరేషన్‌గా చిరంజీవి వచ్చారని వెంకయ్య అభిప్రాయపడ్డారు. వారిద్దరూ ఇప్పుడు లేరని.. వారిలా అలరించడానికి ఇప్పుడు చిరంజీవి ఉన్నారని కొనియాడారు. ఇలాంటి సినిమాను రూపొందించిన దర్శక నిర్మాతలతో పాటు.. నటించిన వారిందరకీ అభినందనలు తెలిపారు.
వెంకయ్య నాయుడు సమయం తీసుకుని సైరా చూడటం చాలా సంతోషంగా ఉందని చిరంజీవి అన్నారు. ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ వెంకయ్య రాజకీయాల్లో ఎదిగారని గుర్తుచేశారు.
ప్రస్తుతం వెంకయ్యకు సైరా చిత్రాన్నిచూపించిన చిరంజీవి ఇటీవల తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డిలను మూవీ చూడాల్సిందిగా కోరారు. అలాగే ప్రధాని అపాయింట్‌మెంట్ కూడా తీసుకుంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com