రూ. 2000 నోటుకు మంగళం ?

రూ. 2000 నోటుకు మంగళం ?

ఏటీఎంలలో 2 వేల రూపాయల నోట్లు ఈ మధ్య కాలంలో అంతగా కనిపించడం లేదు. గతంలో పెద్దమొత్తంలో నగదు తీస్తే కచ్చితంగా ఎక్కువ సంఖ్యలోనే 2 వేల నోట్లు వచ్చేవి. ఇప్పుడు మాత్రం ఈ సంఖ్య బాగా తగ్గింది. దీనికి కారణం లేకపోలేదు. గతంలో పెద్ద నోట్ల రద్దు తరువాత ప్రవేశపెట్టిన మరింత పెద్ద నోటు 2,000 రూపాయల ముద్రణ ప్రస్తుతం పూర్తిగా నిలిచిపోయిందట..? ఈ విషయాన్ని భారతీయ రిజర్వ్‌ బ్యాంకే స్పష్టం చేసింది.

సమాచార హక్కు చట్టం కింద ఓ వార్తా ప్రసార సంస్థ అడిగిన ప్రశ్నకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఈ మేరకు సమాధానమిచ్చింది. పక్కా అసలు నోట్లుగా అనిపించే నకిలీ కరెన్సీ నోట్లు మళ్లీ చెలామణీలోకి వస్తున్నాయంటూ నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ హెచ్చరించిన నేపథ్యంలో ఆర్‌బీఐ సమాధానం ప్రాధాన్యం సంతరించుకుంది. బ్లాక్‌మనీ, నకిలీ కరెన్సీలకు చెక్‌ పెట్టే ప్రయత్నాల్లో భాగంగానే 2016 నవంబర్‌లో రూ. 1,000, 500 నోట్లను రద్దు చేసిన నరేంద్ర మోదీ ప్రభుత్వం.. ఆ తర్వాత 2,000 నోట్లను ప్రవేశపెట్టింది.

అయితే ఈ ఆర్థిక సంవత్సరంలో ఒక్క రెండు వేల నోటును కూడా ఆర్బీఐ ప్రింట్‌ చేయలేదని స్పష్టం చేసింది. 2016-17 ఆర్థిక సంవత్సరంలో 3,542.991 మిలియన్ రూ. 2 వేల నోట్లను ప్రింట్ చేసిన ఆర్బీఐ.. 2017-18 ఆర్థిక సంవత్సరంలో 111.507 మిలియన్ నోట్లను ముద్రించింది. ఆ ముద్రణ 2018-19 సంవత్సరానికి వచ్చే సరికి 46.690 మిలియన్ నోట్లకు చేరింది. అదే.. ఈ ఏడాది మాత్రం ఒక్క రూ.2 వేల నోటును కూడా ఆర్బీఐ ముద్రించలేదు. దీంతో కచ్చితంగా పెద్ద నోటు రద్దు చేస్తారనే ప్రచారం జోరందుకుంది.

Tags

Read MoreRead Less
Next Story