తెలంగాణ సర్కార్‌పై కాసుల వర్షం

తెలంగాణ సర్కార్‌పై కాసుల వర్షం

మద్యం టెండర్లు తెలంగాణ ప్రభుత్వంపై కాసుల వర్షం కురిపిస్తున్నాయి. వైన్‌ షాపులను దక్కించుకోవడానికి గతంలో ఎప్పుడూ లేని విధంగా పోటీపడ్డారు వ్యాపారులు. రాష్ట్రంలోని 2 వేల 216 వైన్ షాపులకు ఈనెల 9 నుంచి దరఖాస్తులు స్వీకరించారు. చివరిరోజ ఈ సంఖ్య మరింత పెరిగింది. 33 జిల్లాల్లో 34 కేంద్రాల ద్వారా అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. మొత్తం 2,216 షాపులకు గాను ఏకంగా 41వేల దరఖాస్తులు వచ్చాయంటే పోటీ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఒక్కో టెండర్ వేయాలంటే నాన్‌ రీఫండబుల్ ఫీజు కింద 2 లక్షలు చెల్లించాలి. నాన్ రీఫండబుల్ ఫీజు గతంలో లక్ష ఉండగా.. ఈసారి రెండింతలు చేశారు. దీంతో ప్రభుత్వ ఖజానాకు ఓ రేంజ్‌లో కిక్కు వస్తోంది. టెండర్ల ద్వారా వచ్చిన ఆదాయం 821 కోట్లు దాటింది. ఇంకా చాలా జిల్లాల్లో దరఖాస్తులు సమర్పించేందుకు వ్యాపారులు క్యూల్లో ఉన్నట్లు తెలుస్తోంది. సాయంత్రం 4 గంటల్లోపు క్యూలో ఉన్నవారి నుంచి టెండర్లు ఇంకా స్వీకరించారు.

2017లో మద్యం దుకాణాల కోసం 40 వేల దరఖాస్తులు వచ్చాయి. ఈ సారి ఈ రికార్డు ఇప్పటికే బ్రేక్ అయింది. హైదరాబాద్ సిటీలో ఓ ప్రాంతానికి చెందిన వ్యాపారి ఏకంగా 150 టెండర్లు వేసినట్లు తెలుస్తోంది. ఏపీలో మద్యం షాపులను ప్రభుత్వం నడుపుతుండటంతో.. అక్కడి వ్యాపారులు కూడా తెలంగాణపై ఫోకస్ చేశారు. టెండర్లు వేసేందుకు వ్యాపారులు పోటీ పడ్డారు. ముఖ్యంగా ఆంధ్రాకు చెందిన చాలా మంది వ్యాపారులు తెలంగాణలో టెండర్లు వేసేందుకు ఉత్సాహాన్ని చూపించారు. షాపుల సంఖ్య కూడా పెంచడం వారికి కలిసివచ్చింది. దీంతో స్నేహితులు, బంధువుల ద్వారా కూడా టెండర్లు వేయించారు. ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో ఉన్న తమ బంధువులను పురమాయించి మరీ టెండర్లు వేయించినట్లు తెలుస్తోంది. ఇక కొంతమంది సిండికేట్లుగా మారి దరఖాస్తులు చేసుకున్నట్లు సమాచారం. ఇక శుక్రవారం లాటరీ పద్ధతిలో డ్రా తీసి లైసెన్స్‌లు కేటాయించనున్నారు ఎక్సైజ్‌ అధికారులు.

మరోవైపు రాష్ట్రంలో కొత్త మద్యం విధానం 2019 నవంబరు 1 నుంచి 2020 అక్టోబరు 31 వరకు అమల్లో ఉంటుంది. గతంలో ఉన్న 4 శ్లాబులను 6 శ్లాబులుగా మార్చింది. జీహెచ్ఎంసీ పరిధిలో ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మద్యం షాపులను నడుపుకోవచ్చు. ఇతర ప్రాంతాల్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు వైన్ షాపులు తెరిచి ఉంటాయి.

Tags

Read MoreRead Less
Next Story