ఆర్టీసీ సమ్మెపై గవర్నర్‌ తమిళిసై ఆరా

ఆర్టీసీ సమ్మెపై గవర్నర్‌ తమిళిసై ఆరా

ఆర్టీసీ సమ్మెపై గవర్నర్‌ తమిళిసై నేరుగా ఆరా తీశారు. పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకున్నది, కార్మికుల డిమాండ్లపై ఏం ఆలోచించారంటూ.. మంత్రి పువ్వాడ అజయ్‌‌ను ప్రశ్నించారు తమిళిసై. తాజా పరిణామాలపై రవాణాశాఖ కార్యదర్శి.. గవర్నర్‌కు అన్ని విషయాలు వివరించారు. ఇప్పటికే ఆర్టీసీ సమ్మెపై కేంద్రానికి రెండ్రోజుల క్రితమే నివేదిక ఇచ్చారు. ఈ సమయంలో ఆమె నేరుగా రవాణశాఖాతో మాట్లాడటం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇటు సీఎం కేసీఆర్‌ మరోసారి అధికారులతో సమ్మెపై సమీక్షించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. బస్సులను నూటికి నూరు శాతం తిప్పేలా చర్యలు తీసుకోవాలన్నారు.

చర్చలు ముగించి శుక్రవారం శుభవార్తతో వస్తారని ఆశిస్తున్నామని హైకోర్టు మొన్న సూచించింది. కానీ ఇప్పటి వరకు సమ్మెపై ప్రతిష్టంభన తొలగలేదు. ప్రభుత్వం ఇప్పటి వరకు సమ్మె విరమింపజేసేందుకు ఎలాంటి చర్చలు చేపట్టలేదు. మరి హైకోర్టు దీనిపై ఎలా స్పందిస్తుందో చూడాలి.

ప్రభుత్వం పట్టు వీడకపోవడంతో సమ్మె రోజుకు రోజుకూ ఇంకాస్త ఉధృతమవుతోంది. డిమాండ్లపై కార్మికులు వెనక్కు తగ్గడం లేదు. చర్చలకు పిలిస్తే వస్తామని ఆర్టీసీ జేఏసీ నేతలు చెప్తున్నారు. ఇటు బీఆర్కే భవన్‌లో ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు సీఎస్‌ను కలిశారు. ఉద్యోగుల సమస్యలతో పాటు ఆర్టీసీ కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల తీర్మానాలను వినతిపత్రంగా సీఎస్‌కు ఇచ్చారు.

ఆర్టీసీ సమ్మె పరిస్థితిని సీఎస్‌కి తెలియజేశామన్నారు టీఎన్జీవో ప్రెసిడెంట్ కారం రవీందర్. ఆర్టీసీ కార్మికులు అధైర్య పడొద్దన్నారు. ఉద్యోగ సంఘాల ఐఆర్‌తో పాటు 17 అంశాలతో డిమాండ్ల ప్రతిని సీఎస్‌కి ఇచ్చామన్నారు. శనివారం జరిగే ఆర్టీసీ బంద్‌లో ఉద్యోగుల సంఘం పాల్గొంటుందన్నారు. డెడ్‌లైన్‌ లోగా తమ సమస్య పరిష్కారం కాకపోతే తాము సైతం సమ్మెకు వెళ్ళడానికి వెనుకాడబోమన్నారు.

ప్రభుత్వం తమను చర్చలకు ఆహ్వానిస్తే.. విలీనం ఎలా సాధ్యమవుతుందో వివరిస్తామన్నారు ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి. చర్చలు జరిపేందుకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారాయన. శనివారం తెలంగాణ బంద్‌పైనా జేఏసీ సంఘాలు శుక్రవారం నిర్ణయం ప్రకటించనున్నాయి. అన్ని సంఘాలు మద్దతు ఇస్తున్న నేపథ్యంలో తమ సమ్మెను మరింత ఉధృతం చేయాలని భావిస్తున్నాయి. మరి హైకోర్టు ఏం చెబుతుందన్న దాని తరువాత.. కార్యచరణ ప్రకటించే అవకాశం ఉంది. ఇటు హైకోర్టు, అటు గవర్నర్‌ సమ్మెపై జోక్యం చేసుకోవడంతో.. ప్రభుత్వం ఎలా ముందుకెళ్తుందన్నానిపై ఉత్కంఠ పెరుగుతోంది. మంత్రులు, అధికారులతో కమిటీ వేస్తుందా..? లేదా ప్రత్యామ్నాయ ఏర్పాట్లవైపే మొగ్గు చూపుతుందా అన్నది చూడాలి.

Tags

Read MoreRead Less
Next Story