ధన్ తేరాశ్‌కి బంగారం కాదు కొనాల్సింది.. ఐరన్..

ఆమెకు బంగారం అంటే మక్కువే. సందర్భం వస్తే చాలు ఓ చిన్న నగైనా కొనుక్కోవాలని ఉవ్విళ్లూరుతుంది. ఇక ధనత్రయోదశి రోజైతే బంగారం కొనుక్కుంటే మంచిదంటూ ప్రకటనలు వాయించేస్తుంటాయి. వ్యాపారస్తులు మగువను ఆకర్షించడానికి మంచి నగల్ని ఎంచి.. మజూరి తక్కువ.. మన్నిక ఎక్కువ అంటూ తమ షాపుల వైపుకు అడుగులు వేయిస్తుంటారు. నగ వేసుకుంటే మనసుకి ఆనందాన్ని ఇస్తుందేమో కానీ.. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే మాత్రం ఐరన్ చాలా అవసరం అంటోంది ఓ సంస్థ. అందునా మహిళలకు మరీ అవసరం. పీరియడ్స్ కారణంగా చాలా బ్లడ్ కోల్పోవలసి వస్తుంది. తగినంత ఐరన్ శరీరానికి అందకపోతే నీరసించి పోతారు. అందుకే రోజూ తినే ఆహారపదార్థాల్లో ఐరన్ ఉండేలా చూసుకోవాలి.
అదే విషయాన్ని వినూత్నంగా చెబుతూ ఓ విడియోని రూపొందించారు. యూట్యూబ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియోని ఇప్పటికే మిలియన్ల మంది చూశారు. ధన త్రయోదశి రోజు బంగారం బదులు ఐరన్ కొనాలనే సందేశాత్మక మెసేజ్ అందులో ఉంది. ఆరోజు బంగారు నగల మీద కాక ఒంట్లోని ఐరన్ మీద దృష్టి పెట్టమంటూ 'ప్రాజెక్ట్ స్త్రీధన్' పేరుతో పౌష్టికాహారం, సుస్థిర ఆరోగ్యవంతమైన జీవనం గురించి పనిచేసే డీఎస్‌ఎమ్ అనే సంస్థ ఈ సందేశాత్మక ప్రచార చిత్రాన్ని నిర్మించి విడుదల చేసింది. దేశంలో బంగారానికి ఉన్నంత విలువ ఐరన్‌కి లేదు. శరీరంలో ఐరన్ లేక ఇబ్బంది పడుతున్న మహిళల సంఖ్య దేశవ్యాప్తంగా 53 శాతం ఉంది. అందుకే ఈ వీడియోని విడుదల చేసింది సంస్థ. అక్షయ తృతియ, ధన త్రయోదశి లాంటి రోజుల్లో బంగారం కొనాలనుకునే వారు దాని కంటే ముందు ఐరన్ ఉన్న ఆహార పదార్థాలు కొనాలని సూచిస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com