హుజూర్ నగర్‌లో వెల్లివెరిసిన ఓటరు చైతన్యం

హుజూర్ నగర్‌లో వెల్లివెరిసిన ఓటరు చైతన్యం

నెలరోజులుగా తెలంగాణ రాజకీయాలను హీటెక్కించిన హుజూర్ నగర్‌లో చైతన్యం వెల్లివెరిసింది. ఓటర్లు పెద్దఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. భారీగా నమోదైన పోలింగ్‌ శాతంతో ప్రధానపార్టీల్లో టెన్షన్ మొదలైంది. గెలుపోటములపై అంచనాలు మొదలయ్యాయి...

నియోజకవర్గం పరిధిలో ఏడు మండలాల్లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. నాలుగు ప్రధాన పార్టీలు బరిలోకి దిగడంతో పోటీ రసవత్తరంగా సాగింది. ముగ్గురు మహిళలు సహా 28 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ప్రధాన పోటీ టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే కొనసాగింది. టీడీపీ, బీజేపీ ఎవరి ఓటు బ్యాంకును చీల్చాయనే అంశమే గెలుపోటములను ప్రభావితం చేస్తుందని అంచనా వేస్తున్నారు..

పోలింగ్‌లో కొన్నిచోట్ల ఉద్రిక్తతలు తలెత్తాయి. గరిడేపల్లి మండలం, కల్మలచెరువు పోలింగ్‌ కేంద్రంలో హైడ్రామా నడిచింది. TRS అభ్యర్థి సైదిరెడ్డి పోలింగ్ ‌బూత్‌లను సందర్శించడానికి వెళ్లడంతో.. ఆయన్ను ఎస్సై అడ్డుకున్నారు. ఆగ్రహించిన సైదిరెడ్డి.. ఓవర్‌యాక్షన్‌ వద్దనడంతో వాగ్వాదం జరిగింది. సైదిరెడ్డి తీరుకు నిరసనగా కాంగ్రెస్‌ కార్యకర్తలు నినాదాలు చేశారు..

కిష్టాపురం పోలింగ్‌ స్టేషన్‌ దగ్గర కాసేపు గందరగోళం తలెత్తింది. కాంగ్రెస్‌ అభ్యర్థి పద్మావతి రెడ్డిని TRS కార్యకర్తలు అడ్డుకున్నారు. ఉత్తమ్‌ గో బ్యాక్‌ అంటూ నినాదాలు చేశారు. వారికి ధీటుగా కాంగ్రెస్‌ కేడర్‌ నినాదాలతో హోరెత్తించారు. ఇరు వర్గాల కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టడంతో పరిస్థితి సద్దుమణిగింది...

హుజూర్‌నగర్‌ మండలం గోపాలపురం పోలింగ్‌ బూత్‌ నెంబర్‌ 195లో వివాదం చెలరేగింది. ఓ వృద్ధుడు ఓటేసే విషయంలో కాంగ్రెస్‌-టీఆర్ఎస్ ఏజెంట్ల మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది..

విజయంపై ఎవరికి వారే ధీమా వ్యక్యం చేస్తున్నారు. సైదిరెడ్డి విజయం ఖాయమని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. టీఆర్‌ఎస్ నాయకులు ఇచ్చిన సమాచారం మేరకు సైదిరెడ్డి గెలుపు ఖాయమని తెలుస్తోందని అన్నారు. నెల రోజుల నుంచి కష్టపడి పనిచేసిన టీఆర్‌ఎస్ నాయకులకు, కార్యకర్తలకు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ కూడా విజయంపై నమ్మకంతో ఉంది. ప్రభుత్వ వ్యతిరేకత కలిసివస్తుందని ఆ పార్టీ నేతలు అంటున్నారు..

కొన్ని పోలింగ్ కేంద్రాల్లో సాయంత్రం 5 తర్వాత కూడా ఓటర్లు బారులు తీరారు. క్యూలైన్లో నిల్చున్న వారందరికీ ఓటు వేసే అవకాశం దక్కింది. ఈవీఎంలు స్ట్రాంగ్‌ రూంలకు తరలాయి. ఈనెల 24 ఉదయం 8 గంటలకు కౌంటింగ్ మొదలవుతంది. మధ్యాహ్నం 12లోపే ఫలితం తెలిసిపోనుంది.

Tags

Read MoreRead Less
Next Story