హుజూర్ నగర్ ఉప ఎన్నిక.. పోలింగ్‌లో ఉద్రిక్తత..

హుజూర్ నగర్ ఉప ఎన్నిక పోలింగ్‌లో అక్కడక్కడా ఉధ్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి.. గరిడేపల్లి మండలం, కల్మలచెరువు గ్రామం పోలింగ్ స్టేషన్‌లో హై డ్రామా కనిపించింది. టిఆర్‌ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి పోలింగ్‌బూత్‌లను సందర్శించడానికి వెళ్లడంతో.. ఆయన్ను స్థానిక ఎస్సై అడ్డుకున్నారు.
స్థానిక నేతలు ఎవరినీ లోపలకు అనుమతించేది లేదని ఆ ఎస్సై స్పష్టం చేశారు. దీంతో ఆగ్రహించిన సైదిరెడ్డి.. ఎస్సైపై మండిపడ్డారు. ఓవర్‌యాక్షన్ వద్దని.. తాను టిఆర్‌ఎస్ అభ్యర్థిని అని చెప్పడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. సైదిరెడ్డి తీరుకు నిరసనగా కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలు చేశారు.
ఇక చింతలపాలెం కిష్టాపురం పోలీంగ్ స్టేషన్ దగ్గరా హైడ్రామా నడిచింది. పోలింగ్ సరలిని తెలుసుకునేందుకు వచ్చిన కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్ పద్మావతిని టిఆర్‌ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఉత్తమ్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. వారికి ధీటుగా కాంగ్రెస్ కార్యకర్తలు కూడా నినాదాలతో హోరెత్తించారు. ఇరు వర్గాల కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టడంతో పరిస్థితి సద్దుమణిగింది..
రెండు మూడు చోట్ల ఉద్రిక్తతలు మినహా పోలింగ్ ప్రశాంతంగానే కొనసాగుతోంది. తెల్లవారుజాము నుంచే పోలీంగ్ కేంద్రాలకు క్యూ కట్టారు ఓటర్లు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్... సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఇప్పటి వరకు 69 శాతం పోలింగ్ నమోదయ్యింది. మొత్తం 2 లక్షల 36 వేల 842 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. నిబంధనల ప్రకారం సాయంత్రం 5 గంటల వరకు క్యూలో నిలుచున్న వారందరికి ఓటేసే అవకాశం కల్పించనున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com