బిడ్డతో సహా సినీనటి మృతి

మహారాష్ట్రలో విషాదం చోటుచేసుకుంది. అంబులెన్స్ రావడానికి ఆలస్యమవడంతో మరాఠి నటిపూజా జంజర్(25) మృత్యువాతపడ్డారు. ఆమెతోపాటు అప్పుడే పుట్టిన ఆమె బిడ్డ కూడా మరణించడం పలువురిని కంటతడి పెట్టిస్తోంది. సినీ నటి పూజకు ఇటీవలే వివాహం అయింది. ఈ క్రమంలో గర్భం దాల్చింది. ప్రసవ తేదీ దగ్గరపడటంతో పూజ కుటుంబ సభ్యులు ఆమెను గోరెగావ్‌లోని ఆస్పత్రిలో చేర్పించారు. ఆదివారం ఆమె బిడ్డకు జన్మనిచ్చింది. అయితే పుట్టిన వెంటనే బిడ్డ చనిపోవడంతో పాటుగా పూజకు తీవ్ర రక్తస్రావమైంది. దాంతో ఆమెను హింగోలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించాల్సిందిగా వైద్యులు సూచించారు.
అయితే అప్పటికే అర్ధరాత్రి కావడంతో అంబులెన్స్ కోసం ప్రయత్నించిన కుటుంబ సభ్యులకు నిరాశే ఎదురైంది. అంబులెన్సు ఎంతసేపటికి రాలేదు.. దాంతో సదుపాయాలు సరిగా లేని ఓ ప్రైవేటు అంబులెన్స్‌ని తీసుకువచ్చారు.. పూజను అందులో హింగోలికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే దురదృష్టవశాత్తు మార్గమధ్యలోనే ఆమె మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. పూజ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా పలు మరాఠీ సినిమాల్లో నటించిన పూజ.. గర్భవతి అయిన కారణంగా విరామం తీసుకున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com