నేడు దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగుల సమ్మె..

ప్రభుత్వ బ్యాంకుల విలీనానికి నిరసనగా బ్యాంకు ఉద్యోగుల సంఘాలు దేశవ్యాప్తంగా సమ్మెకు పిలుపునిచ్చాయి. మంగళవారం ఒక రోజు సమ్మె నిర్వహించనున్నట్లు బ్యాంక్ యూనియన్లు పేర్కొన్నాయి. రెండు బ్యాంకు సంఘాలు 24 గంటల సమ్మెను ప్రకటించడంతో బ్యాంకింగ్ కార్యకలాపాలపై ప్రతికూల ప్రభావం పడనుంది. దాదాపు 2 లక్షలకుపైగా ఉద్యోగులు సమ్మెలో పాల్గొననున్నారు.
ఇటీవలి కాలంలో బ్యాంకు విలీనాలు, డిపాజిట్ రేట్లు తగ్గడం, ఉద్యోగ భద్రత సమస్యలపై నిరసనగా ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్, బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సమ్మెను చేపట్టాయి. అయితే ఈ సమ్మెకు ఆర్బీఐ, ఎస్‌బీఐ దూరంగా ఉంటున్నట్లు సమాచారం. అలాగే ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, సహకార బ్యాంకులు కూడా సమ్మెలో పాల్గొనడం లేదు. సమ్మె కారణంగా తమ కార్యకలాపాలపై ప్రతికూల ప్రభావం పడొచ్చని బ్యాంక్ ఆఫ్ బరోడా మార్కెట్ రెగ్యులేటరీకి ఇప్పటికే తెలియజేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com