చేయగలిగింది చేస్తా.. వారితో మాట్లాడతా..

చేయగలిగింది చేస్తా.. వారితో మాట్లాడతా..

ప్రత్యేక హోదా ఇవ్వటం ద్వారా ఆంధ్రప్రదేశ్‌ను ఆదుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను మరోసారి కోరారు. అమిత్ షాను కలిసిన జగన్ రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై దాదాపు 45 నిమిషాలపాటు చర్చలు జరిపారు. పరిశ్రమలు, సేవా రంగాల వాటా 68.2 శాతానికి పడిపోయిందని జగన్‌ వివరించారు. ప్రత్యేక హోదా ద్వారానే ఈ సమస్యను పరిష్కరించగలుగుతామని చెప్పారు. చెన్నై, హైదరాబాద్‌, బెంగళూరు కాకుండా ఏపీవైపు చూడాలని ఆయన అమిత్‌షాకు విజ్ఞప్తి చేశారు. 2014-15 రెవెన్యూ లోటును కాగ్‌తో చర్చించి సవరిస్తామని గతంలో హామీ ఇచ్చిన విషయాన్ని జగన్‌ గుర్తు చేశారు. దీనిపై సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని అమిత్‌షాను కోరారు. విభజన సమయంలో ప్రకటించిన రెవెన్యూ లోటుకు సంబంధించి 18,969 కోట్లు రావాల్సి ఉందన్నారు. ఈ నిధులను వెంటనే విడుదల చేసేలా ఆర్థిక శాఖకు ఆదేశాలు జారీ చేయాలని కోరారు.

విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు కడపలో స్టీల్‌ ప్లాంట్‌ నిర్మించాలని, ప్రకాశం జిల్లా రామాయపట్నంలో పోర్టు నిర్మాణ పనులను వెంటనే చేపట్టాలని అమిత్‌షాను జగన్‌ కోరారు. అలాగే విశాఖపట్నం-చెన్నై పారిశ్రామిక కారిడార్, కాకినాడలో పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు అవసరమైన నిధులను సమకూర్చాలని విజ్ఞప్తి చేశారు. వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి ఇవ్వవలసిన నిధులను వెంటనే విడుదల చేయాలన్నారు. పోలవరం అంశం కూడా సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాల ప్రకారం 55,548 కోట్లకు ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. పోలవరం నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు ఖర్చు చేసిన 5,073 కోట్లను వెంటనే విడుదల చేయాలన్నారు. పోలవరం పనుల్లో రివర్స్ టెండరింగ్ ద్వారా 838 కోట్ల ప్రజాధనాన్ని ఆదా చేశామని ఆయన అమిత్ షాతో చెప్పారు.

నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టులకు గోదావరి వరద జలాలు తరలించే అంశం గురించి కూడా అమిత్‌షాతో జగన్‌ చర్చించారు. కృష్ణా జలాలపై ఆధారపడిన రాయలసీమ, కృష్ణా డెల్టా సహా తాగునీరు, సాగునీటి కొరత ఉన్న ప్రాంతాల సమస్యలను పరిష్కరించేందుకు ఈ ప్రాజెక్టు ఎంతో దోహదపడుతుందన్నారు. ప్రాజెక్టును చేపట్టేలా సంబంధిత శాఖలను ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. జగన్మోహన్‌రెడ్డి చెప్పినదంతా సావకాశంగా విన్న అమిత్ షా తాను చేయగలిగింది చేస్తానని హామీ ఇచ్చారు.

అమిత్‌షాతో భేటీ అనంతరం.. కేంద్రమంత్రులు రవిశంకర్‌ ప్రసాద్‌, ప్రహ్లాద్‌ జోషీని కలవాల్సి ఉంది. అయితే, అర్ధంతరంగా ఢిల్లీ పర్యటన ముగించుకుని రాష్ట్రానికి వచ్చేశారు జగన్‌. ఢిల్లీ నుంచి నేరుగా విశాఖ వెళ్లారు. అమిత్‌షా సూచనల మేరకే కేంద్రమంత్రుల అపాయింట్‌మెంట్లను రద్దు చేసుకున్నట్లు సమాచారం.. మొదట తాను మంత్రులతో మాట్లాడతానని.. ఆ తర్వాతే వారిని కలవాలని జగన్‌కు అమిత్‌షా సూచించనట్లు సీఎంవో కార్యాలయం వెల్లడించింది.

Tags

Read MoreRead Less
Next Story