సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి

హుజూర్‌నగర్ కోటపై తొలిసారి గులాబీ జెండా రెపరెపలాడింది. TRS అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి 43 వేల 233 ఓట్ల భారీ మెజార్టీతో ఘన విజయం సాధించారు. మొత్తం 22 రౌండ్లలో కాంగ్రెస్ కనీసం ఒక్క రౌండ్‌లో కూడా ఆధిక్యం సాధించలేదు. హుజూర్‌నగర్ ఉపఎన్నికలో మొత్తం 2 లక్షల 239 ఓట్లు పోలయ్యాయి. ఇందులో టీఆర్‌ఎస్ అభ్యర్థి శానంపూడిసైదిరెడ్డికి లక్షా 12 వేల 796 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్ పద్మావతి రెడ్డికి 69వేల 563 ఓట్లు వచ్చాయి.. TRS 56.45 శాతం ఓట్లు సాధించగా.. కాంగ్రెస్ 34.60 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. టీడీపీ, బీజేపీ కనీసపోటీ కూడా ఇవ్వలేక పోయాయి. ఈ రెండు పార్టీల డిపాజిట్లు గల్లంతయ్యాయి.. స్వతంత్ర అభ్యర్థి సపవత్ సుమన్ మూడో స్థానంలో నిలిచారు. ఇతడికి 2 వేల 693 ఓట్లు పోలయ్యాయి. 4వ స్థానంలో నిలిచిన బీజేపీ క్యాండిడేట్ కోట రామారావుకి 2 వేల 621 ఓట్లు, ఐదో స్థానంలో ఉన్న టీడీపీ అభ్యర్థి చావా కిరణ్మయికి 18 వందల 27 ఓట్లు వచ్చాయి.
గతంలో ఎప్పుడూ లేనంతగా రికార్డు మెజార్టీ సాధించారు శానంపూడి సైదిరెడ్డి. 2009లో హుజూర్‌నగర్ నియోజకవర్గం ఏర్పడింది. ఇవి నాలుగో ఎన్నికలు. ఇప్పటి వరకు 2009లో వచ్చిన 29,194 ఓట్లే అత్యధిక మెజార్టీ. ఇప్పుడు ఈ రికార్డును బ్రేక్ చేస్తూ ఏకంగా 43 వేల 233 ఓట్ల మెజార్టీతో రికార్డు క్రియేట్ చేశారు సైదిరెడ్డి.
హుజూర్‌నగర్ నగర్ కాంగ్రెస్‌కు కంచుకోట. ఈ నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఇక్కడ హస్తం హవా నడుస్తోంది..వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు ఉత్తమ్‌కుమార్ రెడ్డి. మొదటి సారి జగదీశ్ రెడ్డి, తర్వాత శంకరమ్మ, 2018లో సైదిరెడ్డిపైనా విజయం సాధించారు ఉత్తమ్. 2018లో కేవలం 7వేల ఓట్ల మెజార్టీతో గట్టెక్కారు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి. అయితే సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తమ్ నల్గొండ ఎంపీగా గెలవడంతో.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఉపఎన్నిక అనివార్యమైంది.
హుజూర్‌నగర్ ఉపఎన్నికను ప్రధానపార్టీలన్నీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. టీఆర్ఎస్, కాంగ్రెస్‌తోపాటు.. బీజేపీ, టీడీపీ కూడా బరిలోకి దిగడంతో పోరు రసవత్తరంగా మారింది. అయితే గతంలో ఓటమి పాలయ్యారన్న సింపతీతోపాటు, KCR మార్క్ మ్యాజిక్ కూడా వర్కౌట్ కావడంతో టీఆర్‌ఎస్ భారీ విజయం నమోదు చేసింది. ఇక ఈ ఉపఎన్నికపై ఆర్టీసీ సమ్మె కూడా ప్రభావం చూపలేదు. టీఆర్‌ఎస్‌కు వచ్చిన మెజార్టీని చూస్తే ఓటర్ల స్పష్టంగా టీఆర్ఎస్ వైపు మొగ్గుచూపినట్లు స్పష్టమవుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com