ఒక్క ఎన్నికతో కింగ్‌ మేకర్‌గా మారిన దుష్యంత్ సింగ్ చౌతాలా

ఒక్క ఎన్నికతో కింగ్‌ మేకర్‌గా మారిన దుష్యంత్ సింగ్ చౌతాలా
X

dushyant-chautala.png

మాజీ ఉప ప్రధానికి ముని మనవడు.. మాజీ ముఖ్యమంత్రికి మనవడు.. మాజీ ఎంపీ కూడా.. ఇప్పుడు కింగ్ మేకర్.. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనే ముఖ్య పాత్రధారి. ప్రభుత్వ ఏర్పాటులో ఆయనే కీలకం. ఒక్క ఎన్నికతోనే రాష్ట్రంలో సంచలనం సృష్టించడమే కాకుండా యావత్ దేశం దృష్టిని ఆకర్షించారు. ఆయనే దుష్యంత్ సింగ్ చౌతాలా.

దుష్యంత్ చౌతాలా మాజీ ఉప ప్రధాని దేవీలాల్‌కు ముని మనవడు. హర్యానా మాజీ సీఎం ఓం ప్రకాష్ చౌతాలాకు మనవడు. గత లోక్‌సభ ఎన్నికల్లో INLD తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత ఏకంగా పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. ఆ కసితో కొత్త పార్టీ పెట్టుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పర్యటించారు. కీలకమైన జాట్ల మద్ధతు సాధించి కింగ్‌ మేకర్‌గా అవతరించారు.

మాజీ ఉప ప్రధాని దేవీలాల్‌కు హర్యానాలో గట్టి పట్టు ఉండేది. ఆయన 1996లో ఇండియన్ నేషనల్ లోక్‌దళ్ పార్టీని నెలకొల్పారు. దేవీలాల్ తర్వాత పార్టీ పగ్గాలను ఆయన పెద్దకుమారుడు ఓం ప్రకాశ్ చౌతాలా అందుకున్నారు. రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ కీలక పదవులు నిర్వహించారు. ఐతే, అవినీతి కేసులో ఓపీ చౌతాలాతో పాటు ఆయన కుమారుడు అజయ్ చౌతాలకు శిక్ష పడడంతో వారిద్దరూ జైలుకు వెళ్లారు. దాంతో ఐఎన్‌ఎల్‌డీలో ఆధిపత్య పోరు ఏర్పడింది. అజయ్ చౌతాలా కుమారులు దుష్యంత్, దిగ్విజయ్‌, దుష్యంత్ బాబాయ్ అభయ్ సింగ్‌ చౌతాలా పార్టీపై పట్టు కోసం పోరాడారు. చివరికి, దుష్యంత్, దిగ్విజయ్‌లను పార్టీ నుంచి బహిష్కరించారు. దాంతో, దుష్యంత్ వేరు కుంపటి పెట్టుకున్నారు.

జననాయక జనతా పార్టీ.. దుష్యంత్ సింగ్ చౌతాలా పార్టీ పేరు ఇది. దేవీలాల్‌ను హర్యానా ప్రజలు జననాయక్ అని పిలిచేవారు. దాంతో ముత్తాత పేరుతోనే పార్టీ నెలకొల్పారు. ఇక హర్యానాలో జాట్ల ప్రాబల్యం ఎక్కువ. చౌతాలా కుటుంబం మొదటి నుంచి జాట్ల ఓట్లపైనే ఆధారపడింది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో జాట్ల ఓట్లు చీలడంతో బీజేపీ లాభపడింది. ఇప్పుడు జాట్లు మళ్లీ ఏకమై దుష్యంత్ సింగ్‌కు మద్ధతు ఇచ్చారు.

వాస్తవానికి హర్యనా అసెంబ్లీ ఎన్నికల్లో చౌతాల పార్టీ తుడిచిపెట్టుకుపోతుందని సర్వేలు అంచనా వేశాయి. ఐతే, ఈ లెక్కలు తప్పాయి. ఐఎన్ఎల్‌డీ కిందా మీదా పడి 2 స్థానాలు సాధించి పరువు నిలబెట్టుకుంది. ఇక, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు షాక్ ఇస్తూ జేజేపీ కింగ్ మేకర్‌గా అవతరించింది. తొలి ఎన్నికలోనే ఏకంగా 10 స్థానాలు సాధించి సత్తా చాటింది.

Next Story

RELATED STORIES