మోదీ-అమిత్ షాల జోడీ మరోసారి విజయఢంకా?

మోదీ-అమిత్ షాల జోడీ మరోసారి విజయఢంకా?
X

మోదీ-అమిత్ షాల జోడీ మరోసారి విజయఢంకా మోగిస్తుందా..? ఫడ్నవిస్‌కు రెండోసారి సీఎం అయ్యే యోగ్యముందా..? మనోహర్ లాల్ ఖట్టర్‌ మళ్లీ అధికారంలోకి వస్తారా..? మహారాష్ట్ర-హర్యానాల్లో ప్రజా తీర్పు ఎలా ఉండబోతోందీ..? ఈ ప్రశ్నలన్నింటికీ మ రికొన్ని గంటల్లో జవాబులు రానున్నాయి. ఉదయం పది గంటల నుంచే ట్రెండ్స్‌ తెలిసే అవకాశం ఉంది. లోక్ సభ ఎన్నికల తర్వాత జరిగిన తొలి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఎవరికి పట్టం కట్టారో కొన్ని గంటల్లో తేలిపోనుంది.

రెండు రాష్ట్రాల్లో అభ్యర్థుల జాతకాలను తేల్చే ఓట్ల లెక్కింపు మరికాసేపట్లో ప్రారంభం కానుంది. 8 గంటలకు కౌంటింగ్‌ను ప్రారంభిస్తారు. ముందుగా బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు. తరువాత ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఇప్పటికే కౌంటింగ్‌కు ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎన్నికల సంఘం పటిష్ట ఏర్పాట్లు చేసింది. కౌంటింగ్ కేంద్రాల దగ్గర భారీగా పోలీసులను మోహరించింది. సమస్యాత్మక, సున్నిత ప్రాంతాల్లో అదనపు బలగాలను రంగంలోకి దింపారు.

కేంద్రంలో మోదీ సర్కారు వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన తొలి ఎన్నికలు కావడంతో కాషాయకూటమి కాస్త టెన్షన్ పడుతోంది. ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవిస్, మనోహర్ లాల్ ఖట్టర్‌ల పనితీరుతో పాటు ఈ 6 నెలల్లో మోదీ సర్కారు తీసుకున్న నిర్ణయాలపై ప్రజా తీర్పు వెలువడబోతోంది. ప్రజా పరీక్షలో ఫడ్నవిస్‌, ఖట్టర్‌లు పాసయ్యారో లేదో గురువారం తేలిపోనుంది.

మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలున్నాయి. మొత్తం 3,237 మంది అభ్యర్థులు బరిలోకి దిగారు. ఇందులో 235 మంది మహిళలున్నారు. బీజేపీ-శివసేన కూటమి, కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి మధ్య హోరాహోరీ పోరు జరిగింది. బీజేపీ-164, శివసేన-124, కాంగ్రెస్‌-147, ఎన్సీపీ- 121 మంది అభ్యర్థులు బరిలోకి దిగారు. MNS-101,MIM-51, సీపీఐ-16, సీపీఎం 8 స్థానాల్లో పోటీ చేసింది. బీఎస్పీ 262 స్థానాల్లో అభ్యర్థులను దింపింది. 14 వందల మంది స్వతంత్రులు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఇక, హర్యానాలో 90 అసెంబ్లీ సీట్లున్నాయి. మొత్తం 1,169 మంది పోటీ పడ్డారు. ఇందులో 105 మంది మహిళలున్నారు. బీజేపీ, కాంగ్రెస్‌, జన నాయక్‌ జనతాపార్టీ, ఇండియన్ లోక్‌దళ్ మధ్య చతుర్ముఖ పోటీ జరిగింది.

Next Story

RELATED STORIES