కెనడాలో స్థిరపడిన సైదిరెడ్డి తెలంగాణ రాజకీయాల్లో..

కెనడాలో స్థిరపడిన సైదిరెడ్డి తెలంగాణ రాజకీయాల్లో..

saidhireddy

హుజూర్‌నగర్‌ బైపోల్‌లో బంపర్ విక్టరీ సాధించడంతో శానంపూడి సైదిరెడ్డి పేరు మార్మోగుతోంది. శానంపూడి సైదిరెడ్డి.. సూర్యాపేట జిల్లా గుండ్లపల్లి గ్రామంలో 1974లో జన్మించారు. తండ్రి అంకిరెడ్డి. తల్లి సత్యవతి. అంకిరెడ్డి గ్రామ సర్పంచ్‌గా పని చేశారు. స్థానికంగా మంచి రాజకీయ పలుకుబడి ఉంది. సైదిరెడ్డి విద్యాభ్యాసం అంతా సూర్యాపేట జిల్లాలోనే సాగింది. సైదిరెడ్డి దంపతులకు అంకిరెడ్డి, అనిరుధ్ రెడ్డి అని ఇద్దరు కుమారులున్నారు. మొదట ఐటీ ప్రొఫెషనల్‌గా యునైటెడ్ నేషన్స్‌లోని కరేబియన్‌లో ఉద్యోగం చేసిన సైదిరెడ్డి, ఆ తర్వాత కెనడా వెళ్లారు. 2005లో భార్య రజితతో కలిసి ఫుడ్ బిజినెస్ ప్రారంభించారు. మయూరి ఇండియన్ రెస్టారెంట్ పేరుతో డబ్బు తో పాటు పేరు ప్రతిష్ఠలు సంపాదించారు.

సీఎం కేసీఆర్ విధానాలకు ఆకర్షితుడై TRS పార్టీలో చేరారు సైదిరెడ్డి. ఆ తర్వాత తెలంగాణలోనూ పలు వ్యాపారాలు మొదలుపెట్టారు. 2016లో తన తండ్రి పేరు మీద అంకిరెడ్డి ఫౌండేషన్ ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాల ద్వారా ప్రజాక్షేత్రంలోకి వెళ్లారు. 2014 ఎన్నికల్లో హుజూర్‌నగర్ టికెట్ కోసం ప్రయత్నించినప్పటికీ దక్కలేదు. అప్పుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మను బరిలోకి దింపారు. 2018లో జరిగిన ఎన్నికల్లో సైదిరెడ్డి వైపు మొగ్గారు కేసీఆర్. స్థానికంగా పట్టు ఉండడం, ఆర్థికంగా బలమైన నాయకుడు కావడంతో టికెట్ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో కేవలం 7 వేల ఓట్ల తేడాతో ఉత్తమ్ కుమార్ రెడ్డి చేతిలో ఓడిపోయారు సైదిరెడ్డి.

సీఎం కేసీఆర్‌తోపాటు.. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో సైదిరెడ్డికి మంచి సంబంధాలున్నాయి. 2018 ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ ప్రజాక్షేత్రంలోనే ఉన్నారు సైదిరెడ్డి. నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాల కోసం రూ.80 కోట్ల నిధులను సమకూర్చారు. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలోనూ పార్టీని ముందుండి నడిపించారు. తిరుగులేని విజయం సాధించిపెట్టారు. కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న హుజూర్‌నగర్‌లో ప్రాంతంలో టీఆర్‌ఎస్‌ను పటిష్టపరచడంలో కీలకపాత్ర పోషించారు. నియోజకవర్గ ప్రజలు, వ్యాపార వర్గాల్లోనూ సైదిరెడ్డికి మంచిపేరు ఉంది. అందుకే మరోసారి సైదిరెడ్డికే టికెట్ ఇచ్చారు సీఎం కేసీఆర్. పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ముచేయకుండా ఈ ఉపఎన్నికలో సత్తా చాటారు సైదిరెడ్డి. రికార్డుస్థాయిలో 43వేల 233 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.

Tags

Read MoreRead Less
Next Story