ఎగ్జిట్‌ పోల్‌ అంచనాలు తలకిందులు.. అంతా రివర్స్

ఎగ్జిట్‌ పోల్‌ అంచనాలు తారుమారయ్యాయి.. మహారాష్ట్రలో మరోసారి అధికారం దక్కించుకున్న బీజేపీ.. హర్యానాలో మాత్రం సత్తా చాటలేకపోయింది.. అనుకున్న దానికంటే ఎక్కువ సీట్లు సాధిస్తుందని ఎగ్జిట్‌ పోల్స్‌ చెప్పినా, ఆ అంచనాలన్నీ ఫలితాల్లో తలకిందులయ్యాయి.. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-శివసేన కూటమి స్పష్టమైన ఆధిక్యం సాధించింది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 145కు మరో 16 సీట్లు ఎక్కువే సాధించింది. మహారాష్ట్రలో మొత్తం 288 స్థానాలున్నాయి. తాజా ఫలితాల్లో బీజేపీ-శివసేన కూటమి 161 స్థానాలు సాధించింది. కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి 98 సీట్లు కైవసం చేసుకుంది. ఇతరులు 29 స్థానాల్లో విజయం సాధించారు. పార్టీల వారీగా చూస్తే బీజేపీకి 105 సీట్లు వచ్చాయి. శివసేన 56 స్థానాల్లో గెలుపొందింది. ఎన్సీపీ 54, కాంగ్రెస్ 44 సీట్లు కైవసం చేసుకున్నాయి. స్వతంత్రులు 26 చోట్ల పాగా వేశారు. ఎంఐఎం అనూహ్యంగా 3 సీట్లలో విజయం సాధించింది.

గత ఎన్నికలతో పోలిస్తే మహారాష్ట్రలో బీజేపీ, శివసేన బలం తగ్గింది. అదే సమయంలో కాంగ్రెస్, ఎన్సీపీ బలం పెరిగింది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 122 సీట్లు సాధించింది. శివ సేన 63 స్థానాల్లో గెలుపొందింది. కాంగ్రెస్-42, ఎన్సీపీ-41 సీట్లు సాధించాయి. ఐదేళ్ల తర్వాత బీజేపీ దాదాపు 20 సీట్లు కోల్పోయింది. శివసేన ఆరేడు స్థానాలు కోల్పోయింది. కాంగ్రెస్‌కు 2 సీట్లు పెరగగా, ఎన్సీపీ ఏకంగా 13 సీట్లు ఎక్కువ సాధించింది.

ఇక హర్యానాలోనూ సర్వేలు ఫెయిలయ్యాయి. అధికారాన్ని నిలబెట్టుకో వడంలో బీజేపీ విఫలమైంది. కమలదళం, కాంగ్రెస్, జేజేపీ మధ్య జరిగిన త్రిముఖ పోరులో ప్రజలు కూడా మిక్స్‌డ్‌గా తీర్పు ఇచ్చారు. ఓటర్లు ఏ పార్టీకి కూడా పూర్తి మద్ధతు కట్టబెట్టలేదు. ఫలితంగా హంగ్ అసెంబ్లీ ఏర్పడింది. హర్యానా అసెంబ్లీలో మొత్తం 90 స్థానాలున్నాయి. బీజేపీకి 40 స్థానాలు వచ్చాయి. కాంగ్రెస్ 31 సీట్లు సాధించి సత్తా చాటింది. తొలిసారి పోటీ చేసిన జననాయక్ జనతా పార్టీ 10 సీట్లలో విజయం సాధించింది. స్వతంత్రులు, ఇతరులు 9 స్థానాల్లో గెలుపొందారు. ఐతే, ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 46. ఏ పార్టీ కూడా మ్యాజిక్ ఫిగర్‌ను చేరుకోలేకపోయింది. హంగ్ అసెంబ్లీ ఏర్పడడంతో జేజేపీ, స్వతంత్రులు కీలకంగా మారారు. ఏకంగా ఏడుగురు మంత్రులు ఓటమి పాలయ్యారు. ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, మంత్రి అనిల్ విజ్‌లు మాత్రమే గెలుపొందారు. పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు పరాజయం చూడాల్సి వచ్చింది. ఇక, గత ఎన్నికలతో పోలిస్తే బీజేపీ 8 సీట్లు కోల్పోయింది. 2014లో బీజేపీకి 47 సీట్లు వచ్చాయి. అలాగే, కాంగ్రెస్ పార్టీకి ఏకంగా 17 సీట్లు పెరిగాయి. 2014లో హస్తం పార్టీకి 15 సీట్లు రాగా తాజా ఎన్నికల్లో 32 స్థానాలు లభించాయి.

హర్యానాలో హంగ్‌ ఏర్పడ్డా.. ప్రభుత్వ ఏర్పాటుపై బీజేపీ ధీమాగా కనబడుతోంది.. దీపావళికి ముందుగానే ప్రజలు తమను ఆశీర్వదించారన్నారు ప్రధాని మోదీ. మహారాష్ట్ర, హర్యానాల్లో మెజార్టీ సీట్లు సాధించిన సందర్భంగా.. ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన సంబరాల్లో పాల్గొన్నారు ప్రధాని మోదీ. నేతలకు, కార్యకర్తలకు అభినందనలు తెలిపిన ఆయన.. రెండు రాష్ట్రాల్లో ప్రజలు బీజేపీనే నమ్మారని అభిప్రాయపడ్డారు. ఈ విజయం తమ ముఖ్యమంత్రుల పని తీరుకు నిదర్శనం అన్నారు. ఈ విజయాలు తమకు డబుల్‌ బూస్ట్‌ ఇచ్చాయన్నారు మోదీ.

ఇక మహారాష్ట్ర, హర్యానాలో మెజార్టీ సీట్లు అందించిన ప్రజలకు కృతజ్ఞత తెలిపారు బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా.. రెండు మూడు రోజుల్లో మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్నారు. ఐదేళ్ల పాటు ప్రజల సంక్షేమానికే ప్రధాని మోదీ పని చేశారని.. అందుకే వారంత మరోసారి బీజేపీ పట్టం కట్టారని అభిప్రాయపడ్డారు. ఇద్దరు ముఖ్యమంత్రులు మరోసారి రెండు రాష్ట్రాల అభివృద్ధికి ఇంకాస్త కృషి చేస్తారన్నారు అమిత్‌ షా.

ఇక దేశవ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ, మిత్రపక్షాలు సత్తా చాటాయి.. ఉత్తర్‌ప్రదేశ్‌, అసోం, గుజరాత్‌, హిమాచల్‌ప్రదేశ్‌, తమిళనాడులో సత్తా చాటాయి.

Next Story

RELATED STORIES