క్లైమాక్స్‌కు చేరిన హర్యానా రాజకీయం

హర్యానా రాజకీయం క్లైమాక్స్‌కు చేరింది. ప్రభుత్వ ఏర్పాటు దిశగా వేగంగా అడుగులు వేస్తోంది బీజేపీ. ఇప్పటికే ఇండిపెండెంట్లతో మంతనాలు జరిపింది కమలదళం. హర్యానాలో మ్యాజిక్‌ ఫిగర్‌కు కేవలం 6సీట్ల దూరంలో ఆగిపోయింది బీజేపీ. దీంతో 8 సీట్లు గెల్చుకున్న స్వతంత్ర అభ్యర్థులు కీలకంగా మారారు. ఈ ఎనిమిదిమందిలోనూ బీజేపీ రెబల్సే ఎక్కువగా ఉండటం కలిసివచ్చే అంశంగా చెప్పవచ్చు. టికెట్లు ఇవ్వలేదన్న కోపంతో కొందరు పార్టీకి వ్యతిరేకంగా బరిలోకి దిగి గెలిచారు. ఇప్పుడు వారంతా తమ మద్దతు బీజేపీకే అని ప్రకటించారు. ఇప్పటివరకు రంజిత్ చౌతాలా, రాకేష్, గోపాల్ కందా, సోమ్‌వీర్, నయాన్‌పాల్ రావత్, ధరమ్‌పాల్ బీజేపీకే తమ మద్దతని తేల్చేశారు.

హర్యానాలో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని మనోహర్ లాల్ ఖట్టర్ ధీమా వ్యక్తం చేశారు. ఉదయం ఢిల్లీలో బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేడీ నడ్డాను కలిసి రాష్ట్రంలోని పరిస్థితులపై వివరించారు. స్వతంత్ర అభ్యర్థులు మద్దతు ప్రకటించడంతో ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగు వేస్తున్నట్లు తెలిపారు. కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేలు తమ నేతగా ఖట్టర్‌ను ఎన్నుకోనున్నారు. ఆ వెంటనే గవర్నర్ సత్యదేవ్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరుతారని తెలుస్తోంది. మొదట ఖట్టర్ ఒక్కరే సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తారని సమాచారం. దీపావళి అనంతరం మంత్రివర్గ విస్తరణ ఉంటుందని తెలుస్తోంది..

హర్యానాలో మొత్తం 90 నియోజవర్గాలకు గాను బీజేపీ 40 సీట్లను కైవసం చేసుకోగా, కాంగ్రెస్ 30, జననాయక్ జతతా పార్టీ 10 స్థానాలు, INLD-1,

ఇతరులు 8 స్థానాల్లో విజయం సాధించారు. ఏ పార్టీ కూడా మ్యాజిక్ ఫిగర్ దాటకపోవడంతో హంగ్ తప్పలేదు. అయితే లోక్‌హిత్ పార్టీ నేత గోపాల్ కందా బీజేపీకి మద్దతు పలకడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎట్టిపరిస్థితుల్లోనూ ఆయన మద్దతు తీసుకోవద్దని అన్నారు బీజేపీ సీనియర్ నేత ఉమాభారతి. నైతిక విలువల పునాదులను బీజేపీ మరిచిపోవద్దని, సచ్ఛీలురైన వారికి మాత్రమే కలుపుకొని వెళ్లాలని హితవు పలికారు. అటు కందా మద్దతు తీసుకోవడంపై కాంగ్రెస్, శివసేన కూడా బీజేపీపై

విమర్శలు గుప్పించాయి.

Next Story

RELATED STORIES