తాజా వార్తలు

ఆ రికార్డును బ్రేక్‌ చేసిన సైదిరెడ్డి

టీఆర్‌ఎస్‌ అనుకున్నది సాధించింది. హుజూర్‌నగర్‌ కోటపై గులాబీ జెండా ఎగరేయాలన్న కల నెరవేర్చుకుంది. కాంగ్రెస్‌ కంచుకోటను బద్దలు కొట్టింది.. బీజేపీ, టీడీపీ అడ్రెస్‌లు గల్లంతు చేస్తూ బంపర్‌ మెజార్టీ దక్కించుకుంది. ఆ పార్టీ అభ్యర్థి సైదిరెడ్డి 43వేల 233 ఓట్లతో విజయం సాధించారు. కౌంటింగ్ మొదలైనప్పటి నుంచే కారు టాప్‌గేరులో దూసుకెళ్లింది. తొలి రౌండ్ నుంచే TRS అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి స్పష్టమైన ఆధిక్యం సాధించారు. ప్రతి రౌండ్‌కు మెజార్టీ పెరుగుతూ పోయింది. మొత్తం 22 రౌండ్లలో కాంగ్రెస్ కనీసం ఒక్క రౌండ్‌లో కూడా ఆధిక్యం సాధించలేదు. TRS గెలుపు ఖాయమని భావించినా.. ఈ స్థాయిలో మెజార్టీని ఎవరూ ఊహించలేదు. రికార్డుస్థాయి ఆధిక్యం రావడంతో టీఆర్ఎస్ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి.

హుజూర్‌నగర్‌ ఉపఎన్నికలో మొత్తం 2 లక్షల 239 ఓట్లు పోలయ్యాయి.. ఇందులో టీఆర్‌ఎస్ అభ్యర్థి శానంపూడిసైదిరెడ్డికి లక్షా 12 వేల 796 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్‌ పద్మావతి రెడ్డికి 69వేల 563 ఓట్లు వచ్చాయి.TRS 56.45 శాతం ఓట్లు సాధించగా.. కాంగ్రెస్ 34.60 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. టీడీపీ, బీజేపీ కనీస పోటీ కూడా ఇవ్వలేక పోయాయి. 2009లో ఏర్పడ్డ హుజూర్‌నగర్ నియోజకవర్గానికి ఇవి నాలుగో ఎన్నికలు. ఇప్పటి వరకు 2009లో వచ్చిన 29,194 ఓట్లే అత్యధిక మెజార్టీ. ఆ రికార్డును బ్రేక్‌ చేస్తూ ఏకంగా 43 వేలా 233 ఓట్ల మెజార్టీతో రికార్డు క్రియేట్ చేశారు సైదిరెడ్డి.

సీఎం కేసీఆర్‌ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధే తనను గెలిపించాయని సైదిరెడ్డి అన్నారు. తనపై నమ్మకం ఉంచిన సీఎం కేసీఆర్‌తో పాటు.. పార్టీ పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గం అభివృద్ధిని ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి పట్టించుకోలేదని ఈ ఉప ఎన్నికల ఫలితంతో తేలిపోయిందన్నారు సైదిరెడ్డి.

హుజూర్‌నగర్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి విజయం సాధించడంపై ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. హుజూర్‌నగర్‌ ప్రజలు టీఆర్‌ఎస్‌పై సంపూర్ణ విశ్వాసం చూపించారని అన్నారు. పని చేసే ప్రభుత్వానికి ఈ విజయం ఓ టానిక్‌ లాంటిదన్నారు. ఇప్పటికైనా విపక్షాలు తమ పంథా మార్చుకోవాలని సూచించారు. రేపు హుజూర్‌నగర్‌ కృతజ్ఞతా సభ నిర్వహించనున్నట్లు చెప్పారు.. హుజూర్‌నగర్‌ వెళ్లి స్వయంగా అక్కడి వారి సమస్యలు తెలుసుకుంటానని కేసీఆర్‌ చెప్పారు.

గతంలో ఓటమి పాలయ్యారన్న సింపతీతోపాటు, KCR మార్క్ మ్యాజిక్ కూడా వర్కౌట్ కావడంతో టీఆర్‌ఎస్ భారీ విజయం నమోదు చేసిందన్నది విశ్లేషకుల అభిప్రాయం. ఇక ఈ ఉపఎన్నికపై ఆర్టీసీ సమ్మె కూడా ప్రభావం చూపలేదు. టీఆర్‌ఎస్‌కు వచ్చిన మెజార్టీని చూస్తే ఓటర్ల స్పష్టంగా టీఆర్ఎస్ వైపు మొగ్గుచూపినట్లు స్పష్టమవుతోంది. ఇక భారీ మెజార్టీతో గెలుపొందిన సైదిరెడ్డికి టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Next Story

RELATED STORIES