శివసేనకు కాలం కలిసొచ్చిందా..? ముఖ్యమంత్రిగా ఆదిత్య?

శివసేనకు కాలం కలిసొచ్చిందా..? ముఖ్యమంత్రిగా ఆదిత్య?

aditya-thakare

మహారాష్ట్రలో కొన్ని దశబ్దాలుగా తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్న శివసేనకు ఇప్పటికి కాలం కలిసి వచ్చింది. ఇప్పుడు పూర్తిస్థాయిలో పులి పంజా విసురుతోంది. ఇన్నాళ్లు సమయం కోసం ఎదురుచూసిన శివసేన ప్రస్తుత పరిస్థితుల్ని క్యాష్‌ చేసుకోవాలని చూస్తోంది.

శివసేన ట్విస్టులు బీజేపీకి షాక్ ఇస్తున్నాయి. 50-50 ఫార్ములాను బలంగా తెరపైకి తెస్తోంది శివసేన. అయితే ఈ డిమాండ్లను జాగ్రత్తగా గమనిస్తోన్న....BJP ప్రస్తుతానికి ఎలాంటి ప్రకటనా చేయలేదు. మహారాష్ట్రలో మొత్తం 288 స్థానాలకు గానూ.. బీజేపీ 105, శివసేన 56 స్థానాలను కైవసం చేసుకున్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 145 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. గతంలో కంటే బీజేపీకి సీట్లు తగ్గడంతో...తమ డిమాండ్లపై ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు శివసేన. ఫిఫ్టీ-ఫిఫ్టీ ఫార్ములను పదేపదే ప్రస్తావిస్తోంది.

బీజేపీ-శివసేన బంధం పైకి బలంగానే ఉన్నా... గత ప్రభుత్వంలోనూ పులులు గర్జిస్తూనే ఉన్నాయి. తమకు నచ్చని పని ప్రభుత్వం చేసినపుడల్లా... బాహాటంగానే శివసేన విమర్శలు చేసింది. ఇప్పుడు తాజాగా... గతంలో కంటే బీజేపీకి తక్కువ సీట్లు రావడంతో శివసేన స్వరం పెంచింది. సీఎం పీఠం తమ పార్టీకి కావాల్సిందేనంటూ పట్టుబడుతోంది.

శివసేన ప్రత్యక్ష రాజకీయాల్లో దశాబ్దాలుగా ఉన్నప్పటికీ... ఆ పార్టీ పెద్దపులి బాల్‌ ఠాక్రే నుంచి మొన్నటి వరకు ఎవరూ ఎన్నికల్లో పోటీకి దిగలేదు. తాజా ఎన్నికల్లో బాల్‌ ఠాక్రే మనవడు ఆదిత్య ఠాక్రే వర్లీ నుంచి పోటీకి దిగి పంజా విసిరారు. ఆయన గెలుపుతో మహా ముఖ్యమంత్రి ఆదిత్య ఠాక్రే అంటూ ప్రచారం ఊపందుకుంటోంది. మహారాష్ట్ర భావి సీఎం అంటూ వర్లి నియోజకవర్గం అంతటా పోస్టర్లు వెలిశాయి. పోస్టర్ల ద్వారా తమ డిమాండ్‌ను బీజేపీ దృష్టికి తీసుకెళ్తున్నారు శివసైనికులు. వర్లీలో ఎన్సీపీ అభ్యర్థిపై 67 వేల భారీ మెజారిటీతో గెలుపొందారు ఆదిత్య.

సొంత పత్రిక సామ్నాలో ఎన్సీపీపై ప్రశంసలు కురిపించి ఇప్పటికే బీజేపీ షాక్ ఇచ్చింది శివసేన. అంతేకాదు, మహారాష్ట్ర ఓటర్లు భారీ విజయాన్ని, స్పష్టమైన తీర్పునిచ్చారని బీజేపీ చెప్పిన వ్యాఖ్యలను కూడా అంగీకరించలేదు. ఇది కేవలం తీర్పు మాత్రమేనని.. ప్రజాతీర్పు కాదని సంపాదకీయంలో రాసుకొచ్చింది. అయితే ఈ పరిణామాలన్నింటినీ జాగ్రత్తగా గమనిస్తోంది బీజేపీ. శివసేనకు డిప్యూటీ సీఎం పదవిని ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి పదవిని త్యాగం చేసేందుకు కలమదళం సిద్ధంగా లేనట్లు సమాచారం.

అమిత్‌ షా ఎన్నికల ముందు తమ ఇంటికి వచ్చినప్పుడు కూడా ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పామని ఉద్దవ్ ఠాక్రే ఇప్పటికే స్పష్టం చేశారు. పొత్తు కుదుర్చుకున్నప్పుడే ఈ ప్రతిపాదనకు బీజేపీ అంగీకారం తెలిపిందని ఆయన చెబుతున్నారు. ఈ ఫార్ములా కింద భాగస్వామ్య పక్షాలు రెండూ చెరో రెండున్నరేళ్లు అధికారం పంచుకోవాల్సి ఉంటుంది.

ఏమనుకోకండి... అంటూనే శివసేన ఎంపీ సంజయ్ రౌత్ తన ట్విట్టర్ వేదికగా బీజేపీపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. శివసేన గుర్తైన పులి కమలం వాసన చూస్తున్న ఓ కార్టూన్‌ను ఆయన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. దీపావళి కదా... తప్పుగా అనుకోకండి అని శీర్షిక పెట్టారు. ఒకవేళ బీజేపీ తమ డిమాండ్లకు ఒప్పుకోకపోతే ఎన్సీపీ, కాంగ్రెస్ మద్దతు తీసుకుంటాం అన్న మెసేజ్‌ను ఇవ్వడానికే సంజయ్ ఈ కార్టూన్‌‌ను పోస్ట్ చేశారన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అటు బీజేపీని ఓడించడానికి శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీలు కలిసి ఓకూటమిగా ఏర్పడే ఛాన్స్ ఉందంటూ మాజీ సీఎం పృథ్వీరాజ్ చవాన్ కూడా వ్యాఖ్యానించారు. అయితే కాంగ్రెస్ మాత్రం శివసేన నుంచి తమకు ఎలాంటి ప్రతిపాదన రాలేదని స్పష్టం చేసింది.

Tags

Read MoreRead Less
Next Story