తెలంగాణలో మరో ఎన్నికల నగరా

తెలంగాణలో మరో ఎన్నికల నగరా

తెలంగాణలో మరో ఎన్నికల నగరా మోగనుంది. త్వరలోనే పురపాలక, నగర పాలక సంస్థలకు త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఈ నేపథ్యంలో అర్హులైన ప్రతి ఒక్కరూ ఓట్లర జాబితాలో తమ పేర్ల ఉందో లేదో సరిచూసుకోవాలని సూచించారు. 2019 జనవరి ఒకటి వరకూ రూపొందించిన ఓటర్ల జాబితా ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తామని ఎన్నికల సంఘం తెలిపింది.

ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే నాటికి జాబితాలో ఉన్న వారికి మాత్రమే ఓటు హక్కు ఉంటుందని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. జులై 16న మున్సిపల్‌ కమిషనర్లు ఫొటోతో కూడిన ఓటరు జాబితాను విడుదల చేసినట్లు తెలిపింది. రాష్ట్ర ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లోని ఓటర్ల జాబితాలతో పరిశీలించుకుని ఓటర్ స్లిప్పులను సైతం డౌన్‌లోడ్ చేసుకోవచ్చని పేర్కొంది. ఏవైనా పొరపాట్లు, ఇబ్బందులు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించింది.

అటు మున్సిపల్‌ ఎన్నికలపై దాఖలైన పిటిషన్‌లను ఇటీవల హైకోర్టు కొట్టి వేసింది. ఎన్నికలు జరిపేందుకు గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చింది. అటు 77 పురపాలక సంఘాల్లో ఎన్నికలపై హైకోర్టు సింగిల్ బెంచ్ విధించిన స్టేను ఎత్తివేయాలని ప్రభుత్వం కోరింది. స్టే ఎత్తి వేస్తే రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలకు ఒకే సారి ఎన్నికలు జరుపుతామని చెప్పింది. దీనిపై ఈనెల 31న మరోసారి వాదనలు వింటామని హైకోర్టు తెలిపింది. అన్ని ఏర్పాట్లు పూర్తయినందున నవంబర్‌ మొదటి వారంలో నోటిఫికేషన్ వెలువడే సూచనలు కన్పిస్తున్నాయి. ఒక వేళ 31న కోర్టు తీర్పు వాయిదా పడితే డిసెంబర్‌లో నోటిఫికేషన్‌ వచ్చే అవకాశం ఉంది.

మరో వైపు నవంబర్‌లోగా మున్సిపల్ ఎన్నికలు పూర్తి చేస్తామని సీఎం కేసీఆర్‌ ఇప్పటికే ప్రకటించారు. ఈమేరకు అధికారులకు కూడా ఆదేశాలు ఇచ్చారు. ఈనేపథ్యంలో అధికారులు కసరత్తు ముమ్మరం చేశారు. నవంబర్ తొలివారంలో పుర ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది.

Tags

Read MoreRead Less
Next Story