జమ్మూ కశ్మీర్‌లో పేట్రేగిపోతున్న ఉగ్రవాదులు

జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదులు పేట్రేగిపోతున్నారు. వరుస దాడులతో ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించడానికి ప్రయత్నిస్తున్నారు. తాజాగా సైన్యం లక్ష్యంగా టెర్రరిస్టులు దాడికి తెగబడ్డారు. పుల్వామాలో ఆర్మీ వెహికిల్‌పై టెర్రరిస్టులు దాడి చేశారు. 44 రాష్ట్రీయ రైఫిల్స్ విభాగానికి చెందిన సైనికులు ప్రయాణిస్తున్న వాహనంపై కాల్పులు జరిపారు. టెర్రర్ అటాక్‌తో జవాన్లు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. ఆ ఏరియాను రౌండప్ చేసి ఉగ్రవాదులపై ఎదురుకాల్పులు జరిపారు. ఈ ఎన్‌కౌంటర్ కొనసాగుతుండగా మరోచోట దాడి జరిగింది. సీఆర్‌పీఎఫ్ బంకర్‌పై ముష్కరమూకలు దాడి చేశాయి. అక్కడ కూడా సైనికులు, ముష్కరుల మధ్య కాల్పులు జరిగాయి.
సోమవారం సోపోర్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. సామాన్య పౌరులు లక్ష్యంగా గ్రనేడ్ దాడి చేశారు. ఈ అటాక్‌లో 15 మంది పౌరులు గాయపడ్డారు. అందులో ఆరుగురు పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. అంతకుముందు ఆపిల్ వ్యాపారస్థులపైనా కాల్పులు జరిపారు. ఆపిల్ పండ్లు తరలిస్తున్న ట్రక్కులనూ టార్గెట్ చేశారు. యూరోపియన్ యూనియన్ పార్లమెంటరీ బృందం కశ్మీర్ పర్యటనకు వచ్చిన సమయంలోనే టెర్రరిస్టులు విచ్చలవిడిగా కాల్పులకు తెగబడడం గమనార్హం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com