బీజేపీ కొత్త ఫార్ములాతో రసవత్తరంగా 'మహా'రాజకీయం

బీజేపీ కొత్త ఫార్ములాతో రసవత్తరంగా మహారాజకీయం

maha

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. శివసేనతో 50:50 డీల్‌కు కమలనాథులు ఏమాత్రం ఆసక్తిగా లేరు. అయితే.. బీజేపీ 13-26 ఫార్ములాను తెరపైకి తెస్తున్నట్టు తెలుస్తోంది. శివసేనకు 13 కేబినెట్‌ బెర్తులు ఇస్తామని, తాము అందుకు రెట్టింపు పదవులు తీసుకుంటామని ప్రతిపాదన చేస్తున్నట్టు సమాచారం. నవంబర్ 9లోగా ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నపీస్‌ ప్రమాణ స్వీకారం చేస్తారని బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. బీజేఎల్పీ సమావేశానికి కేంద్ర పరిశీలకులుగా నరేంద్రసింగ్‌ తోమర్‌, జాతీయ ఉపాధ్యక్షుడు అవినాష్‌ రాయ్‌ ఖన్నా వచ్చారు. శాసనసభాపక్ష నేతగా ఫడ్నవీస్‌ను ఎన్నుకోవడం లాంచనమే అయినా.. శివసేన విషయంలో ఎలాంటి చర్చ జరుగుతుందనేది ఆసక్తిగా మారింది.

13-26 ఫార్ములాపై శివసైనికులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది. మరోవైపు.. శివసేన గురువారం మధ్యాహ్నం కీలక సమావేశం నిర్వహించబోతోంది. పార్టీలో కీలక నాయకుడు ఆదిత్య థాక్రే తన కొంకణ్ పర్యటన రద్దు చేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.

105 స్థానాలతో అతి పెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ.. రెబెల్‌ అభ్యర్థుల్ని తమ వైపు తిప్పుకుంటోంది. వారంతా మద్దతు ఇస్తే 125కి బలం చేరుతుంది. బీజేపీ సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే మరో 40 సీట్లు కావాలి. స్వతంత్రులు మద్దతు ఇచ్చినా... బలం చాలదు. శివసేన రొటేషన్‌ పద్ధతిలో సీఎం డిమాండ్‌ను విడిచిపెట్టకపోతే.. బీజేపీ ఎన్సీపీతో చేతులు కలిపినా ఆశ్చర్యపడనక్కర్లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎన్సీపీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బీజేపీతో జట్టుకట్టేది లేదని చెబుతోంది. అయితే ఎన్సీపీని బయట నుంచి మద్దతు ఇవ్వాలని బీజేపీ కోరే అవకాశం ఉందని తెలుస్తోంది. 54 సీట్లతో ఎన్సీపీ బలమైన శక్తిగానే అవతరించింది. ఈ రెండు పార్టీలు చేతులు కలిపితే వారి బలం 159కి చేరుకుంటుంది. అందులోనూ పవార్‌ చుట్టూ ఈడీ ఉచ్చు బిగుస్తూ ఉండడంతో ఎన్సీపీ రాజీపడే అవకాశాలున్నాయనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story