తాజా వార్తలు

అబార్షన్ చేయించి బాల్‌రెడ్డి ఏమైపోయాడు?

కన్నతల్లిని కిరాతకంగా కడతేర్చిన కూతురు కీర్తి కేసులో బాల్‌రెడ్డి ఎక్కడున్నాడు? కీర్తి మొదటి ప్రియుడు... ఆమెను గర్భవతిని చేసి.. అబార్షన్ చేయించిన బాల్‌రెడ్డి ఏమైపోయాడు? ఈ అనుమానాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. చర్లపల్లి జైలుకు పోలేదని.. చంచల్‌గూడకు రాలేదని అక్కడి సిబ్బంది చెప్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన హత్యకేసులో బాల్‌రెడ్డిపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. కీర్తితో పాటు ఆమె ఇద్దరు ప్రియుళ్లను అరెస్టు చేసి, రిమాండుకు తరలించారు. హయత్‌నగర్‌ పోలీసులు నిందితుల్లో ఇద్దరు యువకులు శశికుమార్‌, బాల్‌రెడ్డిని చర్లపల్లి జైలుకు, కీర్తిని చంచల్‌ గూడ మహిళా జైలుకు తరలించినట్లు చెప్పారు. అయితే కేవలం శశికుమార్‌ మాత్రమే వచ్చాడని, బాల్‌రెడ్డిని తీసుకురాలేదని చర్లపల్లి జైలు సిబ్బంది అంటున్నారు. బాల్‌రెడ్డి విషయమై... తమకు అసలు ఎలాంటి సమాచారం అందలేదని కూడా చెప్తున్నారు.

కీర్తిపై అత్యాచారం చేసినందుకు గాను పోక్సో కేసులో అరెస్టయిన మొదటి ప్రియుడు, నిందితుడు బాల్‌రెడ్డి రిమాండులో భాగంగా చర్లపల్లికి జైలుకు వెళ్లకపోవడంపై అనుమానాలు తలెత్తుతున్నాయి. శశికుమార్‌తో పాటు, బాల్‌రెడ్డిని కూడా చర్లపల్లికి తరలించి, కీర్తిని చంచల్‌గూడకు తరలించామని హయత్‌నగర్‌ పోలీసులు చెప్పారు. కానీ బాల్‌రెడ్డి చర్లపల్లి జైల్లో లేడు.. చంచల్‌గూడకూ రాలేదని జైలు అధికారులు అంటున్నారు. దాంతో బాల్‌రెడ్డి ఏమైపోయాడు? ఎక్కడున్నాడు.. అనేది మిస్టరీగా మారింది.

మరోవైపు.. శశికుమార్‌ను చర్లపల్లి జైల్లోని మానస బ్యారక్‌లో ఉంచారు. శనివారం వైద్య పరీక్షలు, ఇతర ఫార్మాలిటీస్‌ పూర్తి చేశారు. రౌండ్స్‌ అనంతరం అతనికి జైలు ఆవరణలో గడ్డి తొలగించే పని అప్పగించారు. పోలీసులు పెట్టిన పోక్సో, 302 తదితర సెక్షన్‌ల ప్రకారం కనీసం నెల రోజులపాటు శశికుమార్‌కు బెయిల్‌ లభించే అవకాశం లేదని జైలు అధికారులు చెప్తున్నారు.

అటు.. చంచల్‌గూడ మహిళా జైల్లో ఉన్న కీర్తి ప్రవర్తన జైలు అధికారులను షాక్‌కు గురిచేస్తోంది. ఆమె చాలా సాధారణంగా ఉన్నట్లు సమాచారం. ఎలాంటి భయం, బెరుకు ఆమెలో కనిపించడం లేదు. జైలుకు వచ్చాననే భయం కూడా లేదు. జైలు సిబ్బందితో, తోటి ఖైదీలతో కీర్తి చాలా సాధారణంగా మాట్లాడుతోంది. పెద్ద పెద్ద నేరాలు చేసిన ఖైదీలు, కరడుగట్టిన వారిలో సైతం పశ్చాతాపం చూసిన జైలు సిబ్బంది కీర్తి ప్రవర్తనపై ఆరా తీస్తున్నారు. ఎవరు ఏమడిగినా ఏమాత్రం తడుముకోకుండా.. ఆమె వెంటనే సమాధానం చెప్తోంది. ఇదెలా సాధ్యమవుతోందని షాక్‌ తింటున్నారు. హత్య జరిగిన రోజు ఏం జరిగింది? కన్నతల్లిని ఎందుకు చంపాల్సి వచ్చిందనే విషయాలన్నీ కీర్తి తోటి వారికి వివరంగా చెప్తున్నట్లు సమాచారం.

కీర్తి ప్రవర్తన చూసి ఆశ్చర్యపోతున్న జైలు అధికారులు.. ఆమెను ప్రత్యేక పర్యవేక్షణలో ఉంచారు. బ్యారక్‌లో కీర్తి మానసిక పరిస్థితిని, ప్రవర్తనను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందుకోసం తోటి ఖైదీలను సైతం అప్రమత్తం చేసినట్లు సమాచారం. కీర్తికి జైలు అధికారులు ప్రత్యేక కౌన్సెలింగ్‌ అందిస్తున్నట్లు తెలుస్తోంది. కీర్తి మానసిక పరిస్థితిని అంచనా వేసిన తర్వాత.. ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయానికి తరలిస్తారని చెప్తున్నారు.

Next Story

RELATED STORIES