అందరూ చూస్తుండగానే ఎమ్మార్వో విజయారెడ్డిని..

హైదరాబాద్ శివారులో పట్టపగలే దారుణం జరిగింది. అబ్దుల్లాపూర్‌మెట్ MROను పెట్రోల్ పోసి సజీవదహనం చేశాడో దుండగుడు. ఈ ఘటనలో భాగ్యనగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మధ్యాహ్నం 1:30 నిమిషాల సమయంలో అబ్దుల్లాపూర్‌మెట్‌లోని MRO ఆఫీస్‌కు వచ్చాడు సురేష్ అనే వ్యక్తి. రావడంతోనే నేరుగా MRO గదిలోకి వెళ్లి తలుపులు వేశాడు. MRO విజయారెడ్డితో మాట్లాడుతూనే.. ఒక్కసారిగా దాడికి దిగాడు. ఊహించని ఈ ఘటనతో బిత్తరపోయిన విజయారెడ్డి.. కేకలు వేసింది. ఆ అరుపులు విని ఆమె డ్రైవర్ గురునాథం తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లే ప్రయత్నం చేశాడు. కానీ ఈలోపే విజయారెడ్డిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు దుండగుడు.
పెట్రోల్ పోసి నిప్పంటించిన తర్వాత.. తలుపులు తీసుకొని బయటకు పరుగెత్తాడు దుండగుడు సురేష్. అంతా చూస్తుండగానే.. MRO విజయారెడ్డి సజీవదహనం అయ్యారు. అరుపులు, కేకలతో కార్యాలయం మొత్తం భయానక వాతావరణం నెలకొంది. ఏం జరిగిందన్నది కాసేపటి వరకు ఎవరికీ అర్థం కాలేదు. అయితే పెట్రోల్ పోసి నిప్పంటించే క్రమంలో నిందితుడు సురేష్‌కు కూడా తీవ్ర గాయాలయ్యాయి. అటు విజయారెడ్డిని కాపాడేందుకు ప్రయత్నించిన ఆమె డ్రైవర్ గురునాథం, ఫ్యూన్ చంద్రయ్య కూడా గాయపడ్డారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com