తహశీల్దార్ ఆఫీసులో ఊహించని ఘటన.. కాపాడండి అంటూ ఆర్తనాదాలు..

తహశీల్దార్ ఆఫీసులో ఊహించని ఘటన.. కాపాడండి అంటూ ఆర్తనాదాలు..

mro-vijaya

మాటలకందని పైశాచికత్వం. ఊహకు అందని ఉన్మాదం. యావత్ తెలంగాణ రాష్ట్రాన్ని ఒక్కసారిగా ఉలికిపాటుకు గురిచేసిన దారుణ ఘటన. డ్యూటీలో ఉన్న మహిళా తహసీల్దార్‌పై పెట్రోల్‌పోసి సజీవ దహనం చేశాడో కిరాతకుడు. పట్టపగలు.. అది కూడా ఆఫీసులోనే జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. విజయారెడ్డి స్పాట్‌లోనే చనిపోగా.. ఆమెను కాపాడేందుకు ప్రయత్నించిన ఇద్దరు చావుబతుకుల్లో ఉన్నారు. నిందితుడు సురేష్‌ కూడా తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నాడు.

అబ్దుల్లాపూర్‌మెట్ మండల తహసీల్దార్ కార్యాలయం సోమవారం గ్రీవెన్స్ డే కావడంతో చాలా రద్దీగా ఉంది. మధ్యాహ్నం 1:30 నిమిషాల సమయంలో హడావుడిగా వచ్చాడు సురేష్ అనే రైతు. ప్రధాన మార్గం గుండా కాకుండా సెల్లార్‌ నుంచి నేరుగా తహసీల్దార్‌ విజయారెడ్డి గది వద్దకు వెళ్లాడు. అప్పటికే లంచ్‌కు వెళ్దామని బయటకు వెళ్లిపోతున్న ఆమె.. సురేష్‌ను చూసి ఆగింది. భూ వివాదం విషయంలో ఇద్దరి మధ్య పావు గంట చర్చ జరిగింది. అంతే.. గదిలోంచి గట్టిగా అరుపులు, కేకలు. ఏం జరిగిందని విజయారెడ్డి డ్రైవర్, అటెండర్‌ చంద్రయ్య అప్రమత్తమయ్యారు. ఇంతలోనే గదిలోంచి హాహాకారాలు వినిపించాయి.

తహసీల్దార్‌తో మాట్లాడి.. గదిలోంచి బయటకు వెళ్లిపోతున్నట్లు నటించిన సురేష్‌.. డోర్‌ లాక్‌ చేసి వెనక్కి వచ్చాడు. తన వెంట తెచ్చుకున్న బాటిల్‌లోని పెట్రోల్‌ను విజయారెడ్డిపై పోశాడు. లైటర్‌తో నిప్పంటించాడు. ఊహించని ఈ ఘటనతో ఆమె బిత్తరపోయింది. మంటలకు తాళలేక గదిలోంచి బయటకు వచ్చే ప్రయత్నం చేసింది. అయితే సురేష్‌ ఆమెను మళ్లీ వెనక్కి లాగాడు. ఈ క్రమంలోనే అతడికి మంటలు అంటుకున్నాయి. ఆ మంటలతోనే గదిలోంచి పరుగెత్తుకుంటూ బయటకు వచ్చేశాడు. అక్కడే ఉన్న డ్రైవర్ గురునాథం, అడెంటర్‌ చంద్రయ్య విజయారెడ్డిని కాపాడేందుకు ప్రయత్నించారు. వారికి కూడా మంటలు అంటుకున్నాయి. ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. అప్పటికే అగ్నికీలల్లో కాలిపోతున్న విజయారెడ్డి.. కాపాడండి అంటూ ఆర్తనాదాలు చేశారు. అందరూ చూస్తుండగానే కాలి బూడిదయ్యారు.

ఊహించని ఘటనతో రెవెన్యూ ఉద్యోగులు ఉలిక్కిపడ్డారు. కొద్దిసేపటి వరకు అసలక్కడ ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాలేదు. మంటల్లో కాలిపోతున్నది తహసీల్దార్‌ విజయారెడ్డి అనే విషయాన్ని మొదట ఎవరూ గుర్తించలేదు. మేడం ఎక్కడ.. మేడం ఎక్కడ అంటూ సిబ్బంది పరుగులు పెడుతుండటంతో కాలిపోతున్న విజయారెడ్డే చేయిపైకెత్తారు. అప్పడుగానీ వారికి విషయం అర్థం కాలేదు.

నిందితుడు సురేష్‌కు కూడా 60శాతానికిపైగానే గాయాలయ్యాయి. మంటలతోనే వచ్చిన నిందితుడు పోలీస్‌స్టేషన్ ముందు పడిపోయాడు. ఆరా తీస్తే పోలీసులకు అసలు విషయం తెలిసింది. ప్రస్తుతం సురేష్ ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. భూ వివాదం విషయంలోనే దారుణానికి ఒటిగట్టినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అతడిపై హత్య, హత్యాయత్నం కేసులు నమోదు చేశారు. సురేష్ నోరు తెరిస్తే.. ఈ కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

తహసీల్దార్‌ను కాపాడే ప్రయత్నంలో గాయపడిన డ్రైవర్ గురునాథ్‌కు 80శాతానికిపైగా కాలిన గాయాలయ్యాయి. అతనికి డీఆర్డీవో అపోలో ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. అటు అటెండర్ చంద్రయ్యకు కూడా తీవ్రంగానే గాయపడ్డాడు.

Tags

Read MoreRead Less
Next Story