హ్యాపీబర్త్‌డే చీకు.. కోహ్లీ భావోద్వేగపు లేఖ..

హ్యాపీబర్త్‌డే చీకు.. కోహ్లీ భావోద్వేగపు లేఖ..

kohli1

శభాష్ చీకూ.. అప్పుడే నీకు 31 ఏళ్లు వచ్చేశాయా.. ఓసారి వెనక్కి తిరిగి చూస్కో.. కొన్ని తీపి.. కొన్ని చేదు జ్ఞాపకాలు కలబోసి కవ్విస్తున్నాయి కదూ.. వాటన్నింటినీ ఓసారి నెమరువేసుకుందాం.. తెలియని గమ్యం కంటే తెలిసిన ప్రయాణం ఎంతో బావుంటుంది కదూ.. భవిష్యత్ గురించి ఎన్నో కలలున్నాయి నీకు.. వాటి గురించి నన్ను అడక్కు. ఎందుకంటే ముందు ముందు ఏం జరగనుందో తెలియదు. అనుకోనిది జరగాలి.. అది ఓ తియ్యని మధురానుభూతిని మిగల్చాలి.. ప్రతి సవాలునీ స్వీకరించగలగాలి. నిరాశా నిస్పృహల నుంచే ఓ ఆశ చిగురిస్తుంది. ఏదో ఒకటి నేర్చుకోవాలనే పట్టుదలను కలిగిస్తుంది.

నీ కోసం కాలం తనలో చాలా విషయాలను దాచుకుంది. ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకో.. ప్రతి సవాలునీ స్వీకరించు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా ముందుకు సాగడం మర్చిపోనని నిర్ణయం తీసుకో. నిన్ను విమర్శించేవారితో పాటు.. అభిమానించేవారూ ఉన్నారన్న విషయం గుర్తుపెట్టుకో. నిన్ను ద్వేషించే వారి గురించి నువ్వు పట్టించుకోవలసిన అవసరం లేదు. ఆత్మస్థైర్యంతో ముందడుగు వేయి. ఈ రోజు నాన్న నీకు షూ ఇవ్వలేదని ఆలోచిస్తున్నావు కదూ. దానికంటే విలువైనది నీ పుట్టిన రోజు సందర్భంగా నీ నుదుటన ముద్దు పెట్టి నిన్ను కౌగిలించుకున్నారు కదా.. అది వెలకట్టలేనిది. నీ ఎత్తు గురించి నాన్న వేసిన సరదా జోకులు గుర్తు తెచ్చుకో. వాటిని తలచుకుని ఆనందించు.

ఒక్కోసారి నాన్న నీ పట్ల కఠినంగా ఉన్నా అదంతా నీ మంచి కోసమే అనేది గుర్తుపెట్టుకో. అమ్మానాన్న ఎప్పుడైనా అరిచినా అది మన బాగు కోసమే. మన కుటుంబమే మనల్ని అమితంగా ఇష్టపడుతుంది. నువ్వు కూడా తిరిగి వాళ్లని అలాగే ప్రేమించు. పెద్దల మాటల్ని గౌరవించు. వీలైనంత సమయం కుటుంబంతో కలిసి ఉండు. నాన్నని అమితంగా ప్రేమిస్తున్నాననే విషయం ఆయనకి చెప్పు. ప్రతి రోజూ ఆయనకు ఐ లవ్యూ చెప్పు. అప్పుడు ఆయన ముఖంలో వెలుగుతున్న చిరునవ్వుని చూడు. అన్నిటికంటే ముందు నిన్ను నువ్వు నమ్ము. నీ కలలను సాకారం చేసుకో. పెద్ద పెద్ద కలలు మన జీవితాల్ని ఎలా మారుస్తాయో ప్రపంచానికి చూపించు అని కోహ్లీ తనకు తానే లేఖ రాసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తమ అభిమాన ఆటగాడి భావోద్వేగపు లేఖను చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

Read MoreRead Less
Next Story