తాజా వార్తలు

ముగిసిన గడువు.. టీఎస్‌ ఆర్టీసీ భవిష్యత్తు ఏంటి..?

టీఎస్‌ ఆర్టీసీ భవిష్యత్తు ఏంటి..? గడువు ముగిసినా కార్మికులెవరూ విధుల్లో చేరకపోవడంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.. ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించి విధుల్లో చేరడానికి రాష్ట్ర ప్రభుత్వం విధించిన గడువు నిన్న అర్థరాత్రితో ముగిసింది. అయితే, ప్రభుత్వం ఆశించిన స్థాయిలో విధుల్లో చేరడానికి కార్మికులు ముందుకు రాలేదు. గడువు ముగిసే సమయానికి 350 మంది వరకు కార్మికులు మాత్రమే సమ్మతి పత్రాలు ఇచ్చినట్టు సమాచారం. విధుల్లో చేరడానికి సుముఖత వ్యక్తం చేస్తూ రాత్రి 12 గంటలకు వరకు అందిన దరఖాస్తులను జిల్లాల నుంచి డిపోల వారీగా సేకరించి ఆర్టీసీ రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయనుంది. విధుల్లో చేరడానికి ముందుకొచ్చిన కార్మికుల సంఖ్య ఆధారంగా ఎన్ని రూట్లను ప్రైవేటీకరించాలనే కీలక నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. విధుల్లో చేరే వారిని మినహాయించి మిగిలిన రూట్లను ప్రైవేట్‌ పరం చేయనున్నట్టు ప్రభుత్వం ఇప్పటికే హెచ్చరించిన నేపథ్యంలో ఈరోజు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై చర్చ జరుగుతోంది.

మరోవైపు కార్మిక సంఘాలు ఏమాత్రం వెనక్కు తగ్గడం లేదు.. ఆర్టీసీ సమ్మె యథాతథంగా కొనసాగుతుందని జేఏసీ స్పష్టం చేసింది. తామంతా ఒకే మాట మీద నిలబడ్డామని చెబుతోంది. కార్మికులను బెదిరించినా లొంగడం లేదని జేఏసీ గుర్తు చేసింది. భవిష్యత్ కార్యాచరణపై అఖిలపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, కార్మిక, యువజన సంఘాలతో జేఏసీ సమావేశం నిర్వహించింది. సమ్మెను కొనసాగించాల్సిందేనని, తాము కార్మికుల వెంటే ఉంటామని అఖిలపక్ష నేతలు హామీ ఇచ్చారు. ఇదే పోరాట స్ఫూర్తితో ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని జేఏసీ నేత అశ్వత్థామరెడ్డి స్పష్టం చేశారు. చర్చల ద్వారా కార్మికుల డిమాండ్లు పరిష్కరించాలనే తాము కోరుతున్నామని చెప్పారు. ఆర్టీసీని రద్దు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్నారు. కేంద్రం అనుమతి లేకుండా ఆర్టీసీపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం చెల్లదని అశ్వత్థామరెడ్డి స్పష్టం చేశారు.

Next Story

RELATED STORIES