విజయారెడ్డి హత్య వ్యవహారంలో సురేష్ వెనుకున్నదెవరు?

విజయారెడ్డి హత్య వ్యవహారంలో సురేష్ వెనుకున్నదెవరు?

suresh

అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్‌ విజయారెడ్డిని హత్య చేసింది సురేషే అయినా.. దీని వెనుక బడా రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉన్నట్టు వార్తలొస్తున్నాయి. గౌరెల్లి, బాచారం, బండరావిరాలలోని భూములు దశాబ్దాలుగా వివాదాల్లో ఉండటంతో.. వాటికి పాస్‌బుక్‌లు రాలేదు. ఒకవేళ పాస్‌బుక్ వస్తే ఆ భూములు రియల్ ఎస్టేట్‌ వాళ్లకు అమ్ముకోవాలన్నది సురేష్ సహా మరికొందరి ప్లాన్. ఇదే అవకాశంగా తీసుకున్న రియల్ వ్యాపారులు.. విజయారెడ్డిని బెదిరించాలని సురేష్‌ను ఉసిగొల్పినట్టు తెలుస్తోంది. ఐతే.. చివరికి ఆవేశంలో రెచ్చిపోయిన సురేష్‌ ఆమెను హత్య చేసి.. తాను కూడా చనిపోయాడు.

అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలోని గౌరెల్లి, బాచారం చుట్టుపక్కల 412 ఎకరాల భూమిపై వివాదం ఉంది. ఈ భూమికి పట్టాదారు రాజా ఆనందరావు. కానీ అతని ఆచూకీ ఎవరికీ తెలియదు. దాదాపు 50 ఏళ్లుగా వీటిని కొందరు సాగు చేసుకుంటున్నారు. కొందరు ఈ భూములకు కౌలు హక్కు చట్టం కింద పత్రాలు పొందారు. అలాంటి వాళ్లకు ఎంతో కొంత ముట్టచెప్పి రియల్ ఎస్టేట్ వ్యాపారులు వాటిని రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు. ప్రస్తుతం అక్కడ భూముల రేట్లు కోట్లలో ఉన్న నేపథ్యంలో.. మిగతా వివాదాస్పద భూముల్ని కూడా కొట్టేసే పథకాలు చాలా మంది వేస్తున్నారు. అలాంటి ముఠా ట్రాప్‌లో సురేష్ పడ్డాడా అనే అనుమానాలు ఇప్పుడు తెరపైకి వచ్చాయి. బాచారం గ్రామంలో ఉన్న 130 ఎకరాలను.. గౌరెల్లికి చెందిన 27 మంది రైతులు సాగుచేసుకుంటున్నారు. ఇలా తండ్రుల నుంచి వాటాగా సురేష్‌కు 2 ఎకరాలు వచ్చింది. ఐతే.. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సురేష్ ఆ భూమి అమ్మేయాలనుకున్నాడు. కానీ, పాస్‌బుక్ లేకుండా అది సాధ్యం కాదు కాబట్టి.. అప్పటి నుంచి తహశీల్దార్ కార్యాలయం చుట్టూ తిరగడం మొదలుపెట్టాడు. ఐతే.. రెవెన్యూ కోర్టు కేసుల్లో ఉన్న భూములకు పాస్‌పుస్తకాలు జారీ చేయలేనని విజయారెడ్డి స్పష్టం చేశారు. ఇది.. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు షాక్‌లా తగలడంతో తహసీల్దార్‌పైకి సురేష్‌ను ఎగదోశారు. ఒక్కసారి వివాదం సెటిలై, పాస్‌బుక్ వచ్చేస్తే లక్షలకు లక్షలు వస్తాయని ఆశపడిన సురేష్.. అనుకున్నది జరగకపోవడంతో MRO ఆఫీస్‌కి వెళ్లి చివరికి విజయారెడ్డిని చంపేశాడు. ఆ మంటల్లో తను కూడా తీవ్రంగా గాయపడి ఇప్పుడు ప్రాణాలు వదిలాడు.

Tags

Read MoreRead Less
Next Story