తాజా వార్తలు

చలో ట్యాంక్‌బండ్‌ : కార్మిక నేతల అరెస్టు..

తెలంగాణ ఆర్టీసీ కార్మికులు, కార్మికనేతలు చలో ట్యాంక్‌బండ్‌ ఉద్రిక్తతలకు దారి తీసింది. ఈ కార్యక్రమానికి పోలీసుల అనుమతి లభించలేదు. దీంతో పోలీసులు శుక్రవారం నుంచే కార్మికులు, కార్మిక నేతలను ఎక్కడికక్కడే అరెస్టు చేసి పోలీస్‌ స్టేషన్లకు తరలిస్తున్నారు. అయితే కొందరు కార్మికులు మధ్యాహ్నం సమయంలో పలు ప్రాంతాల నుంచి ట్యాంక్ బండ్ వద్దకు ఆందోళనకారులు చేరుకున్నారు. వందల మంది కార్మికులు అకస్మాత్తుగా వచ్చి నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు. కొద్ది సేపు ధర్నా నిర్వహించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకుని అరెస్టులు చేశారు. ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది.

ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డిని గోల్కొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అశ్వత్థామతో పాటు పలువురు జేఏసీ నేతలను సైతం పీఎస్‌కు తరలించారు. ట్యాంక్ బండ్ వద్దకు 20మంది మహిళా కార్మికులు చేరుకున్నారు. నినాదాలు చేస్తూ బారీకేడ్లు దాటి వచ్చేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు అడ్డుకున్నారు. తోపులాట జరిగింది. ఆందోళనకారులను అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. అటు శంషాబాద్ లో తెల్లవారుజూము నుంచే కార్మిక సంఘం నేతలతో పాటు.. కాంగ్రెస్ నాయకులను సైతం అదుపులోకి తీసుకున్నారు.

అటు ఆర్టీసీ ఛలో ట్యాంక్ బండ్ నేపథ్యంలో అటుగా వచ్చే దారులన్నీ కూడా మూసివేశారు. ఎక్కడక్కడ బారీకెడ్లు పెట్టి తనిఖీలు చేస్తున్నారు. కొన్ని రహదారులు మూసివేశారు. ఇందిరాపార్క్, కవాడీగూడ కల్పన థియేటర్ జంక్షన్లు మూసివేసి ట్రాఫిక్ మళ్లిస్తున్నారు. కార్మికులు వచ్చినా... వారిని అడ్డుకుని అరెస్టు చేసి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఆర్పీఎఫ్ పోలీసుల భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కొద్దిసేపటి క్రితమే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ రైలు చేరుకుంది. ఈ క్రమంలో వరంగల్‌కు చెందిన 25 మంది ఆర్టీసీ జేఏసీ నేతల్ని గోపాలపురం రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

కాగా హైదరాబాద్‌లో ఇప్పటి వరకూ 170 మందిని అరెస్ట్‌ చేసినట్లు సీపీ అంజనీకుమార్‌ ఓ ప్రకటనలో తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని సీపీ స్పష్టం చేశారు. గత పదిరోజులుగా శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా పోలీసులు ప్రయత్నిస్తున్నారన్నారు. స్కూలు విద్యార్ధులు, ఉద్యోగులు, వ్యాపారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కఠినంగా వ్యవహరిస్తున్నామన్నారు. కోర్టు ఆదేశాల మేరకు నగరంలో ర్యాలీలకు అనుమతి ఇవ్వడం లేదని... నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని కమిషనర్ హెచ్చరించారు.

Next Story

RELATED STORIES