హైకోర్టు ప్రతిపాదించిన కమిటీపై తెలంగాణ సర్కార్ నిర్ణయమేంటీ?

హైకోర్టు ప్రతిపాదించిన కమిటీపై తెలంగాణ సర్కార్ నిర్ణయమేంటీ?

hi

ఆర్టీసీ సమ్మె పరిష్కారానికి కమిటీ ఏర్పాటుపై ప్రభుత్వం ఎలా స్పందించనుంది. సుప్రీం రిటైర్డ్ జడ్జిలతో కమిటీ వేస్తామన్న హైకోర్టు ప్రతిపాదనకు ఓకే చెబుతుందా? అభ్యంతరం వ్యక్తం చేస్తుందా? ప్రభుత్వ తీసుకోబోయే నిర్ణయం ఆర్టీసీ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది. అటు కోర్టు ప్రతిపాదనపై సమీక్ష నిర్వహించిన సీఎం కేసీఆర్.. ప్రభుత్వ నిర్ణయాన్ని బుధవారం హైకోర్టులో జరిగే విచారణలోనే వెల్లడించాలని నిర్ణయించారు.

మునుపెన్నడూ లేనంతగా తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె సుదీర్ఘంగా కొనసాగుతోంది. అటు ప్రభుత్వం.. ఇటు కార్మికులు మెట్టు దిగటం లేదు. దీంతో సమ్మె 40వ రోజుకు చేరింది. హైకోర్టు కూడా సమ్మె పరిష్కారం కోసం మధ్యే మార్గాన్ని సూచించింది. చర్చలకు వెళ్లమని ఒకరిని ఆదేశించలేం కాబట్టి.. సమ్మె ఆంశాల పరిష్కారినికి ముగ్గురు సుప్రీంకోర్టు రిటైర్ట్ న్యాయమూర్తులతో కమిటీకి ప్రతిపాదించింది.

ఆర్టీసీ సమ్మె, రూట్ల ప్రైవేటీకరణపై మంగళవారం విచారణ చేపట్టిన హైకోర్టు.. కార్మికుల సమ్మె చట్ట విరుద్ధమా? కాదా? అని చెప్పే అధికారం హైకోర్టుకు ఉందా అని ప్రశ్నించింది. ఈ అంశంపై వివరించాలని సీనియర్ కౌన్సెల్‌ విద్యాసాగర్‌ను ఉన్నత న్యాయస్థానం కోరింది. ఇక ఎస్మా కింద సమ్మె చట్ట విరుద్ధమని ప్రకటించవచ్చని.. ఆర్టీసీని 1998, 2015లో ఎస్మా పరిధిలోకి తీసుకొస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయాన్ని పిటీషనర్ కోర్టుకు గుర్తు చేశారు. దీనిపై స్పందించిన హైకోర్టు.. 1998లో ఇచ్చిన ఉత్తర్వులు ఏపీఎస్ ఆర్టీసీకి మాత్రమే వర్తిస్తాయని స్పష్టం చేసింది. 2015లో మరోసారి ప్రభుత్వం జీవో ఇచ్చిందని విద్యాసాగర్ తెలపగా.. పరిశీలించిన న్యాయస్థానం ఆ జీవో ఆరునెలల వరకే వర్తిస్తుందని తెలిపింది. చట్టానికి హైకోర్టు అతీతం కాదని.. పరిధి దాటి వ్యవహరించలేదని ధర్మాసనం అభిప్రాయపడింది.

బస్సుల్లో అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారని పిటిషనర్ తరపు న్యాయవాది తెలపగా.. వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేయాలని సూచించింది. అధిక ఛార్జీల వసూలు కారణంగా సమ్మె చట్ట విరుద్ధమంటూ ప్రకటించలేమని హైకోర్టు అభిప్రాయపడింది. ఇక సుప్రీం కోర్టు రిటైర్డ్ జడ్జిల కమిటీకి సంబంధించి ప్రభుత్వం తమ అభిప్రాయాన్ని తెలపాలని అడ్వకేట్ జనరల్ ను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది.

మొండిపేచిలా మారిన సమ్మెకు ఓ పరిష్కారం కోసం అన్ని వర్గాలు ఆశగా ఎదురు చూస్తున్నాయి. ఈ సమయంలో హైకోర్టు ప్రతిపాదించిన కమిటీ ఏర్పాటుపై ప్రభుత్వ స్పందన ఎలా ఉండబోతుందనేదానిపై ఆసక్తి నెలకొంది. మంగళవారం రాత్రి మరోసారి సమీక్ష నిర్వహించిన సీఎం కేసీఆర్‌.. సమ్మె పరిష్కార అంశాన్ని న్యాయమూర్తుల కమిటీకి అప్పగించడం వల్ల తలెత్తే పరిణామాలపై ఆరా తీశారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తుల కమిటీకి ప్రభుత్వం అంగీకరించడం వల్ల ఆర్టీసీ కార్మికులు వెంటనే సమ్మె విరమించి విధులకు హాజరు కావాల్సి ఉంటుందని, ఆ తదుపరి పరిణామాలు న్యాయమూర్తుల కమిటీ చేసే సిఫారసులపై ఆధారపడి ఉంటుందని న్యాయాధికారులు వివరించినట్టు తెలిసింది. ఈ కమిటీకి చట్టబద్ధత ఉంటుందా? అనే అంశంపై కూడా న్యాయనిపుణులతో చర్చించినట్టు చెబుతున్నారు. అయితే.. కోర్టు ప్రతిపాదనలు, న్యాయాధికారుల సూచనలతో ఇప్పటికే ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలస్తోంది. ఆ నిర్ణయాన్నిప్రభుత్వం నేరుగా కోర్టుకే నివేదించనుంది.

అటు ఆర్టీసీ జేఏసీ మాత్రం సుప్రీంకోర్టు రిటైర్డ్‌ న్యాయమూర్తులతో కమిటీ వేస్తే తమకు న్యాయం జరుగుతుందని చెబుతోంది. ఇప్పటికైనా ప్రభుత్వం చర్చలు జరపాలని కోరుతున్నామని కార్మిక నేతలంటున్నారు. మరోవైపు కోర్టు తీర్పు వచ్చే వరకు సమ్మె కొనసాగించాలని ఆర్టీసీ సంఘాలు నిర్ణయించాయి. అలాగే ట్యాంక్ బండ్ లాఠీచార్జ్ పై NHRCని ఆశ్రియించాలని ఆర్టీసీ జేఏసీ నిర్ణయించింది.

Tags

Read MoreRead Less
Next Story