తాజా వార్తలు

టీఆర్‌ఎస్‌ నేతలకు ఆర్టీసీ సమ్మె సెగ

టీఆర్‌ఎస్‌ నేతలకు ఆర్టీసీ సమ్మె సెగ
X

rtc

టీఆర్‌ఎస్‌ నేతలకు ఆర్టీసీ సమ్మె సెగ మొదలైంది. ఆర్టీసీ సమ్మె ప్రారంభమై 40 రోజులు దాటింది. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనా లేకపోవడంతో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసే దిశగా కార్యాచరణ రూపొందించారు. ఇప్పటికే ప్రజాప్రతినిధుల ఇళ్ల ముట్టడికి జేఏసీ పిలుపునివ్వగా.. పలు చోట్ల అధికార పార్టీ ఎమ్మెల్యేలకు అడ్డగింపులు తప్పలేదు. దీంతో వారంతా నియోజకవర్గాలకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. నియోజకవర్గాలకు వెళ్తే కార్మికులు అడ్డుకుంటారన్న అనుమానంతో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, ఎంపీలు.. ఇలా అధికార పార్టీ ప్రజాప్రతినిదులెవరూ హైదరాబాద్‌ను వదలి జిల్లాలకు వెళ్లే సాహసం చేయడం లేదు.

Also Read : మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధం

పోలీసుల వైఖరి కూడా టీఆర్‌ఎస్‌ నేతలకు తలనొప్పిగా మారింది. మొన్న జరిగిన చలో ట్యాంక్ బండ్ కార్యక్రమంలో కార్మికులపై లాఠీ ఛార్జ్ చేశారు. అంతటితో ఆగకుండా కార్మికుల మధ్యలో నక్సల్స్ సానుభూతిపరులు చేరి తమపైనే రాళ్లు విసిరారనే పోలీసు ఉన్నతాధికారి ప్రకటన చేశారు. దీనిపై కార్మిక సంఘాలు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నాయి. శాంతియుతంగా తాము నిరసనలు తెలియజేస్తుంటే ఇలాంటి ఆరోపణలు చేయడమేంటని మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు నియోజకవర్గాల్లో ఎవరు కనిపించినా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. మొన్న తాండూరు నియోజకవర్గంలో ఓ కార్యక్రమానికి హాజరైన మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కార్మికులు అడ్డుకున్నారు. అలాగే విదేశాల్లోనూ నిరసనలు ఎదురవుతున్నాయి. తెలంగాణ డెవలప్‌మెంట్‌ ఫోరమ్‌ నిర్వహించిన కార్యక్రమానికి హాజరైన టీఆర్‌ఎస్‌ ఎంపీ వినోద్‌కుమార్‌కి ఎన్నారైల నిరసనలు తాకాయి. సేవ్‌ ఆర్టీసీ పేరుతో ప్లకార్డులు పట్టుకుని వినోద్‌కుమార్‌ని ఘెరావ్‌ చేశారు తెలంగాణకు చెందిన ఎన్నారైలు. ఇక భద్రాచలం వెళ్లిన మంత్రి సత్యవతి రాథోడ్‌కు నిరసనలు ఎదురయ్యాయి. అక్కడ జరిగిన సమావేశంలో ఆర్టీసీ సమ్మెపై తీర్మానం చేయాలంటూ ఎమ్మెల్యే పొడెం వీరయ్య ముందు పట్టబట్టారు కార్మికులు.

ఇలాంటి పరిస్థితుల్లో నియోజకవర్గాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు హాజరు కాలేమని గులాబీ పార్టీ ప్రజాప్రతినిధులు తేల్చేస్తున్నారు. ఎక్కడికి వెళ్లినా ఆర్టీసీ కార్మికులు తమను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని.. ఆ సందర్భాల్లో కోపానికి లోనై కార్మికుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తే ప్రజల్లో వ్యతిరేక వస్తుందనే ఆందోళనను ఎమ్మెల్యేలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మున్సిపల్‌ ఎన్నికల ముందు ఎమ్మెల్యేలంతా భారీగా శంకుస్థాపనలకు ప్లాన్‌ చేసుకున్నారు. ఇంతలోనే ఆర్టీసీ కార్మికుల సమ్మె రావడంతో ఆ కార్యక్రమాలన్నిటినీ వాయిదా వేసుకుంటున్నట్లు చెబుతున్నారు.

Next Story

RELATED STORIES