రాజకీయ పార్టీల మధ్య స్మార్ట్ సిటీ వార్‌

రాజకీయ పార్టీల మధ్య స్మార్ట్ సిటీ వార్‌

bjp-vs-trs

కరీంనగర్‌లో రాజకీయ పార్టీల మధ్య స్మార్ట్ సిటీ వార్‌ నడుస్తోంది. టెండర్ల విషయంలో అధికార టీఆర్‌ఎస్‌, కమల దళం మధ్య అవినీతి అరోపణలు, విమర్శలు తారాస్థాయికి చేరుకున్నాయి. స్మార్ట్‌ పనుల్లో భారీ అక్రమాలు జరిగాయని బీజేపీ విమర్శిస్తుంటే.. అభివృద్ధిని చూడలేక అవినీతి రంగు పులుముతున్నారంటూ టీఆర్‌ఎస్‌ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. దీంతో మున్సిపల్‌ ఎన్నికలకు ముందే కరీంనగర్‌ రాజకీయాలు హాట్‌హాట్‌గా మారాయి.

కేంద్రం ప్రకటించిన స్మార్ట్ సిటీ జాబితాలో కరీంనగర్‌ పట్టణానికి చోటు దక్కింది. మౌలిక సదుపాయాల కల్పనతో కరీంనగర్‌ను అద్భుత నగరిగా తీర్చిదిద్దడం స్మార్ట్‌ సిటీ పథకం లక్ష్యం. పట్టణ అభివృద్ధికి కేంద్రం రూ.1878 కోట్లు కేటాయించగా.. ఇప్పటి వరకు రూ.300 కోట్లు మంజూరయ్యాయి. దీంతో పట్టణంలో లింక్‌‌ రోడ్లు, ఇతర మౌలిక వసతుల అభివృద్దికి స్మార్ట్‌ వర్క్స్‌ను 3ప్యాకేజీలుగా విభజించి టెండర్లు పిలిచారు. అయితే ఇక్కడ అసలు సమస్య మొదలైంది.. టెండర్ల విషయంలో అధికార, బీజేపీ పార్టీ నేతల మధ్య పంచాయితీ స్టార్ట్‌ అయింది.

కరీంనగర్‌‌ స్మార్ట్‌ సిటీ పనుల్లో ప్రజాప్రతినిధులకు చెందిన కాంట్రాక్టర్లు కూడా టెండర్లలో పాల్గొన్నారు. కానీ టెండర్‌ ఒకరికే దక్కడంతో.. మరో వర్గం నేతకు చెందిన కాంట్రాక్టర్లు హైకోర్టును ఆశ్రయించారు. అయితే, టెండర్‌ దక్కించుకున్న కాంట్రక్టర్‌కు కార్పొరేషన్‌ అధికారులు పనులు కూడా అప్పగించేశారు. దీంతో అధికారుల తీరుపై బీజేపీ నేతలు ఫైరవుతున్నారు. వివాదం కోర్టులో ఉండగానే సింగిల్‌ టెండర్‌ను ఎలా ఓపెన్‌ చేశారని ప్రశ్నిస్తున్నారు. కాంట్రాక్టర్‌కు లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశంతోనే టీఆర్‌ఎస్‌ నాయకులు వ్యవహరించారని బీజేపీ నేతల ఆరోపణ. టెండర్లలో అక్రమాలు జరిగాయని.. దీనిపై విచారణ జరిపించాలని బీజేపీ నేతలు పట్టుబడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా టెండర్లను కేటాయించారని ఎంపీ బండిసంజయ్‌ పలువురు కేంద్రమంత్రులకు ఫిర్యాదు చేశారు.

స్మార్ట్‌ సిటీ పనుల టెండర్లలో రూ.164 కోట్ల అవినీతి జరిగిందని బీజేపీ నేతల ఆరోపణ. కాంట్రక్టర్‌కి మున్సిపల్‌ శాఖ అధికారులు కూడా సహకరించారని విమర్శలు గుప్పిస్తున్నారు. నిధుల దుర్వినియోగానికి పాల్పడుతోందని.. అధికార పార్టీని ఇరకాటంలో పడేసేందుకు బీజేపీ నేతలు పావులు కదుపుతున్నారు. ఈ నేపథ్యంలో కరీంనగర్‌లో స్మార్ట్ సిటీ పనులపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సమీక్ష నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది.

అయితే, బీజేపీ నేతల అవినీతి ఆరోపణలను అంతేస్థాయిలో తిప్పికొడుతున్నారు అధికారపార్టీ నేతలు. స్మార్ట్ సిటీ పనులను అడ్డుకునేందుకే బీజేపీ కుట్ర చేస్తుందని మంత్రి గంగుల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆధారాలు లేని ఆరోపణలు చేస్తే సహించేది లేదని ఎదురుదాడికి దిగారు. బీజేపీ ఆరోపణలో వాస్తవం లేదని.. ఎలాంటి విచారణకైనా సిద్ధమేనని సవాల్ విసిరారు మంత్రి. దీంతో మున్సిపల్‌ ఎన్నికలకు ముందే కరీంనగర్‌లో రాజకీయం వేడెక్కింది. మంత్రి వర్సెస్‌ ఎంపీగా మారిన స్మార్ట్‌ పంచాయతీని జిల్లా వాసులు ఆసక్తిగా చూస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story