అంతర్జాతీయం

ముగిసిన టైగర్ ట్రయాంఫ్ - 2019

ముగిసిన టైగర్ ట్రయాంఫ్ - 2019
X

tiger-tra

రెండు దేశాలు.. 1700 మంది సైనికులు.. రెండు విడతలు.. తొమ్మిది రోజుల యుద్ధ విన్యాసాలు..మొత్తంగా టైగర్ ట్రయాంఫ్-2019.. యుద్ధనౌకలు, హెలికాఫ్టర్లు, తీరానికి దూసుకొచ్చే సైనిక దళాలతో ఏపీ తీరం యుద్ధ క్షేత్రాన్ని తలపించింది. ఆమెరికా- భారత్ త్రివిధ దళాలు తొలిసారిగా ప్రదర్శించిన సంయుక్త విన్యాసాలు విజయవంతంగా ముగిశాయి.

సముద్రం నుంచి తీరానికి... తీరం నుంచి సముద్రానికి సహాయ బలగాలను తరలించటం.. క్షతగాత్రులను కాపాడటం లాంటి విన్యాసాలు టైగర్ ట్రాయాంఫ్ లో హైలెట్ గా నిలిచాయి. ఈ సమయంలో సాంకేతిక సమన్వయం..సమయం వృదా కాకుండా తీసుకునే జాగ్రత్తలపై పరస్పరం మెళకువలను పంచుకున్నాయి రెండు దేశాలు.

టైగర్ ట్రయాంఫ్-2019 లోభారత త్రివిధ దళాలకు చెందిన 12 వందల మంది సైనికులు పాల్గొనగా ఆమెరికా నుంచి 500 మంది త్రివిధ దళాల బలగాలు పాల్గొన్నాయి. తొలివిడతగా ఈ నెల 13 నుంచి 16 వరకు విశాఖ తీరంలో విన్యాసాలు నిర్వహించారు. ఇక ఈనెల 17 నుంచి 21 వరకు కాకినాడ తీరంలో రెండో విడత విన్యాసాలు నిర్వహించారు. కాకినాడ తీరంలో ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు తీరంలో ఉండే బాధితులను ఎలా రక్షించాలో మాక్ డ్రిల్ నిర్వహించారు.

తీరంలో ఆర్మీకి బ్యాకప్ కావాల్సి వచ్చినా.. గాయపడిన సైనికులకు సాయం అందించాల్సిన పరిస్థితుల్లో... యుద్ధ నౌక నుంచి చేపట్టబోయే చర్యలను ఈ విన్యాసాల్లో చేసి చూపించారు. గాయపడిన సైనికులను తీరం నుంచి నౌకలోని ఆస్పత్రికి తరలించడాన్ని మాక్ డ్రిల్‌లా నిర్వహించారు. అలాగే డిజాస్టర్ రిలీఫ్ బృందాల తరలింపు, శత్రు నౌకలపై దాడుల్లో మెళకువలను విన్యాసాల్లో చేసి చూపించారు.

ఇరు దేశాలకు చెందిన త్రివిధ దళాల సైనికులు... యుద్ధ నౌకలు, హెలికాప్టర్లతో నిర్వహించిన విన్యాసాల్లో.. ఐఎన్‌ఎస్‌ ఘరియాల్‌, ఐఎన్‌ఎస్‌ ఐరావత్‌, ఐఎన్‌ఎస్‌ జలస్వ.. అమెరికాకు చెందిన జర్మన్‌ టౌన్‌ యుద్ధ నౌకలు, తూర్పు నావికాదళానికి చెందిన ఎంఐ-17 హెలీకాఫ్టర్లు , సీ-కింగ్‌, చేతక్‌ హెలీకాఫ్టర్లు పాల్గొన్నాయి. యుద్ధ ట్యాంకులు, ట్రక్కులు, ట్రూపులు, లాంచర్లు, స్పీడ్‌ బోట్లు, ఎయిర్‌క్రాఫ్ట్‌లు సముద్రం మీదుగా ఒడ్డుకు వచ్చే దృశ్యాలు యుద్ధరంగాన్ని తలపించాయి.

ప్రకృతి వైపరిత్యాలు, యుద్ధ సమయంలో గాయపడ్డ క్షతగాత్రులను ఎలా రక్షించాలి? వారిని హెలికాఫ్టర్‌లో సముద్రంలో ఉన్న యుద్ధనౌకకు చేర్చి అందులో శస్త్రచికిత్స, ఇతరత్రా వైద్య సదుపాయాలు ఎలా అందించాలి? అనేది ప్రత్యక్షంగా ప్రదర్శించారు. నిజంగా అక్కడ ప్రమాదం జరిగితే రక్షిస్తున్నారా.. యుద్ధం వచ్చిందా.. అనిపించేలా విన్యాసాలు చేపట్టారు. అమెరికా, తూర్పు నావికాదళ సిబ్బంది తమ వద్ద ఉన్న ఆయుధాలను పరస్పరం ఒకరికి ఒకరు ఎలా ఇచ్చి పుచ్చుకోవాలి? వాటిని ఎలా వినియోగించాలి? వైద్య సదుపాయాలకు సంబంధించిన పరికరాల మార్పిడి, యుద్ధ నిపుణులు, వైద్య నిపుణులను ఎలా ఒకరికొకరు సహకరించుకోవాలి? భాషాపరమైన ఇబ్బందులు లేకుండా ఎలా వ్యవహరించాలి? అనేది అవగాహన వచ్చేలా మాక్ డ్రిల్ నిర్వహించారు.

భూమి, సముద్రం, ఆకాశ మార్గాల్లో ఇరు దేశాల సైనికులు నిర్వహించిన విన్యాసాలు చూసేందుకు సామాన్యులకు అవకాశం లేకుండా పోయింది. అత్యంత కట్టుదిట్టమైన మూడంచెల పోలీస్‌ - సైనిక భద్రత మధ్య విన్యాసాలు నిర్వహించారు. భద్రత కారణాల దృష్ట్యా సందర్శకులను, మీడియాను పోలీసులు మూడు కిలోమీటర్ల ముందే నిలిపేశారు.

పొరుగు దేశాలు చైనా, పాకిస్తాన్ దూకుడు ప్రకటనల సమయంలో టైగర్ ట్రయాంఫ్ ఎంతో కీలకం అయ్యింది. ఇండో- ఫసిఫిక్ ప్రాంతంలో ఆమెరికాకు ప్రధాన రక్షణ భాగస్వామిగా ప్రధాన్యం ఇచ్చినట్లైంది.

Next Story

RELATED STORIES